Solar Rooftop: సోలార్.. గుండె గుబిల్లు
ABN , Publish Date - Nov 24 , 2025 | 04:34 AM
సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకుంటే విద్యుత్తు బిల్లుల బెడద నుంచి కొంత ఉపశమనం లభిస్తుందని అనుకున్న వినియోగదారులపై తెలంగాణ దక్షిణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) దొంగదెబ్బ కొట్టింది. తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి....
రూఫ్‌టాప్ బిల్లులు ఏకపక్షంగా పెంపు.. ఈఆర్‌సీ అనుమతించకున్నా దక్షిణ డిస్కమ్ నిర్ణయం
నెట్‌మీటరింగ్‌కు బదులుగా నెట్ బిల్లింగ్
ఇప్పటిదాకా ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ యూనిట్ల తేడా లెక్కగట్టి బిల్లు
ఇప్పుడేమో ఎక్స్‌పోర్టు, ఇంపోర్ట్ బిల్లులకు వేర్వేరుగా బిల్లులు
ఇంపోర్టు విద్యుత్తుకు చార్జీలు ఎక్కువ
ఈఆర్సీకి మాజీ ఐఏఎస్ ఫిర్యాదు
హైదరాబాద్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకుంటే విద్యుత్తు బిల్లుల బెడద నుంచి కొంత ఉపశమనం లభిస్తుందని అనుకున్న వినియోగదారులపై తెలంగాణ దక్షిణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) దొంగదెబ్బ కొట్టింది. తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) అనుమతించకపోయినా సోలార్ రూఫ్ టాప్ వినియోగదారుల బిల్లులను ఏకపక్షంగా పెంచేసింది. ఈ విషయాన్ని ఓ బాధితుడిగా ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన మాజీ ఐఏఎస్ అధికారి సురేశ్ చందా.. ఈఆర్‌సీకి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని సోలార్ రూఫ్‌టాప్ వినియోగదారులకు ‘నెట్ మీటరింగ్’ విధానంలో బిల్లులను జారీ చేస్తున్నారు. వినియోగదారులు తమ సోలార్ రూఫ్‌టాప్ సిస్టం ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్తును గ్రిడ్‌కు సరఫరా చేస్తారు. దీనిని ఎక్స్‌పోర్ట్ చేసిన విద్యుత్తు అంటారు. గ్రిడ్ నుంచి తీసుకున్న విద్యుత్తును తమ అవసరాలకు వాడుకుంటారు. దీనిని ఇంపోర్ట్ చేసుకున్న విద్యుత్తు అంటారు. ఎక్స్‌పోర్ట్ చేసిన విద్యుత్తుతో పోల్చితే ఇంపోర్టు చేసుకున్న విద్యుత్తు ఎక్కువ ఉన్నప్పుడు .. రెండింటి మధ్య తేడాలు తీసి వాటి ఆధారంగా వినియోగదారులకు బిల్లులను జారీ చేయడాన్ని ‘నెట్‌మీటరింగ్’ విధానంగా చెబుతారు. ఉదాహరణకు ఒక వినియోగదారుడు తన సోలార్ రూఫ్‌టాప్ సిస్టమ్ ద్వారా నెలకు 200 యూనిట్లను ఉత్పత్తి చేసి గ్రిడ్‌కు సరఫరా చేసి, అదే నెలలో గ్రిడ్( ఢిస్కమ్) నుంచి 300 యూనిట్లను వినియోగిస్తాడు. అంటే.. 100 యూనిట్లకు మాత్రమే నెట్ మీటరింగ్ విధానంలో బిల్లులు జారీ చేస్తారు. తాజాగా అక్టోబరు నెల వినియోగానికి సంబంధించి (నవంబరులో) సోలార్ రూఫ్‌టాప్ వినియోగదారులకు దక్షిణ డిస్కమ్‌కు ‘నెట్ మీటరింగ్’కు బదులుగా ‘నెట్ బిల్లింగ్’ విధానంలో బిల్లులు జారీ చేసింది. అంటే వినియోగదారుడు ఉత్పత్తి చేసి గ్రిడ్‌కు ఎక్స్‌పోర్ట్ చేసిన విద్యుత్తుకు, గ్రిడ్ నుంచి వినియోగదారుడు తీసుకున్న విద్యుత్తుకు వేర్వేరుగా చార్జీలను లెక్కించింది. ఈ రెండు చార్జీలను సర్దుబాటు చేసి తుదకు మిగిలే మొత్తాన్ని వినియోగదారులకు బిల్లులుగా జారీ చేసింది.
ఇక్కడే సమస్య
వినియోగదారులు ఎక్స్‌పోర్ట్ చేసే విద్యుత్తుకు టీజీఎస్పీడీసీఎల్ ఇచ్చే చార్జీలతో పోల్చితే వినియోగదారులు ఇంపోర్ట్ చేసుకునే విద్యుత్తుపై విధించే చార్జీలు అధికంగా ఉంటాయి. దాంతో వినియోగదారుల బిల్లులు భారీగా పెరిగిపోయాయి. దీనిపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి(రూ్‌ఫటాప్ పీవీ గ్రిడ్ ఇంటరాక్టివ్ సిస్టమ్స్) రెగ్యులేషన్స్ -2025’ పేరుతో సోలార్ రూఫ్‌టా్‌పకి సంబంధించి కొత్త మార్గదర్శకాలను ఈనెల 15న వెలువరించింది. దీనికి ముందు ఈఆర్‌సీ ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసి, ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. నెట్ మీటరింగ్ విధానానికి బదులు నెట్ బిల్లింగ్ విధానంలో బిల్లుల వసూళ్లకు అనుమతించాలని కోరుతూ దక్షిణ డిస్కమ్ విజ్ఞప్తి చేయగా, ఈఆర్‌సీ పరిగణనలోకి తీసుకోలేదు. తుది రెగ్యులేషన్స్‌లో నెట్ మీటరింగ్ విధానాన్నే కొనసాగించాలని ఈఆర్‌సీ ఉత్తర్వులిచ్చింది. అయితే, దీనికి విరుద్ధంగా ఎస్పీడీసీఎల్ బిల్లులను పెంచేయడం గమనార్హం.
బాధితుడు.. ఇంధన శాఖ మాజీ ముఖ్యకార్యదర్శి
ఇంధన శాఖ మాజీ ముఖ్యకార్యదర్శి సురేశ్ చందా తన సోలార్ రూఫ్‌టాప్ సిస్టమ్ ద్వారా గత జూలైలో 124 యూనిట్ల విద్యుత్తును గ్రిడ్‌కు సరఫరా చేసి గ్రిడ్ నుంచి 309 యూనిట్ల విద్యుత్తును తీసుకుని వాడుకున్నారు. రెండింటిని సర్దుబాటు చేశాక ఆ నెలలకు ఆయనకు 179 యూనిట్ల వినియోగానికి సంబంధించి రూ.877 బిల్లును జారీ చేశారు. గత అక్టోబరులో ఆయన తన సోలార్ రూఫ్‌టాప్ సిస్టమ్ ద్వారా 158 యూనిట్లను గ్రిడ్‌కు ఎక్స్‌పోర్ట్ చేసి తన అవసరాలకు గ్రిడ్ నుంచి 330 యూనిట్ల విద్యుత్తును వాడుకున్నారు. రెండింటిని సర్దుబాటు చేస్తే ఆయనకు 172యూనిట్ల వినియోగానికి మాత్రమే బిల్లు జారీ చేయాల్సి ఉంటుంది. అయితే అక్టోబరు నెల వినియోగానికి గాను(నవంబరు) నెలలో ఆయనకు రూ.1444బిల్లు వచ్చింది. యూనిట్‌కు రూ.7.70దాకా బిల్లు వేశారు. గత జూలైతో పోల్చితే అక్టోబరు ఆయన ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ చేసుకున్న విద్యుత్తు, రెండింటిని సర్దుబాటు చేశాక తుదకు వచ్చే మొత్తాలు సమానంగా ఉన్నా ఆయన అక్టోబరు నెల వినియోగానికి ఆయనకు బిల్లు భారీగా పెరిగిపోయింది. దాంతో ఆయన ఈఆర్‌సీకి శనివారం ఫిర్యాదు చేశారు.