Share News

kumaram bheem asifabad- ప్రభుత్వ భవనాలపై సోలార్‌ ప్లాంట్లు

ABN , Publish Date - Aug 12 , 2025 | 10:45 PM

ప్రభుత్వ భవనాలపై సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డీప్యూటీ సీఎం భట్టి విక్రమా ర్క గత శనివారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. గ్రామ పంచాయతీ నుంచి హైదరాబాద్‌లోని సచివాలయం వరకు ఈ నిర్ణయాన్ని అమలు పర్చాలని కలెక్టర్లకు ఆయన ఆదేశాలు జారీ చేశారు

kumaram bheem asifabad- ప్రభుత్వ భవనాలపై సోలార్‌ ప్లాంట్లు
ఆసిఫాబాద్‌ ఎంపీడీవో కార్యాలయం

- తీరనున్న విద్యుత్‌ భారం

ఆసిఫాబాద్‌రూరల్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ భవనాలపై సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డీప్యూటీ సీఎం భట్టి విక్రమా ర్క గత శనివారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. గ్రామ పంచాయతీ నుంచి హైదరాబాద్‌లోని సచివాలయం వరకు ఈ నిర్ణయాన్ని అమలు పర్చాలని కలెక్టర్లకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో జిల్లా కలెక్టర్‌ సముదాయం, 15 మండల పరిషత్‌, రెవెన్యూ భవనాలు, 335 గ్రామ పంచాయతీ భవనాలు ఉన్నాయి. ఇవే కాకుండా విద్యాశాఖకు సంబంధించిన మండల వనరుల కేంద్రా లు, ఐకేపీ, ఉపాధిహామీ భవనాలు ఉన్నాయి. ప్రస్తుతం వీటన్నింటికీ జరుగుతున్న విద్యుత్‌ సరఫరాకు పెద్ద ఎత్తున బిల్లులు వస్తున్నాయి. ప్రభుత్వం సకాలంలో నిర్వహణ నిధులు విడుదల చేయకపోవడంలాంటి కారణాలతో బిల్లులు సకాలంలో చెల్లించక తడిసి మోపె డవుతూ అన్ని కార్యాలయాలకు భారమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం అవుతోంది. కలెక్టరేట్లు అన్ని ఒకే తరహలో నిర్మించినందున వాటిపై సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటు డిజైన్‌ను హైదరాబాద్‌ నుంచే పంపించ నున్నారు. ప్లాం ట్లు ఏర్పాటుకు కలెక్టర్లు పంపాల్సిన వివరాలకు సంబంధించి ప్రభుత్వం ఓ ప్రశ్నావళిని పంపించబోతోంది. ఇది అందిన వారంలోగా అన్ని వివరాలను పూరించి విద్యుత్‌ శాఖకు పంపాలి. కలెక్టర్లు అందజేసే నివేదిక ఆధారంగా సోలార్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు.

- ఎల్‌టీ, హెచ్‌టీ సర్వీసులు..

తక్కువ విద్యుత్‌ వినియోగం ఉన్న కార్యాలయాలకు ఎల్‌టీ సర్వీసు కింద, విద్యుత్‌ వినియోగం ఎక్కువగా వినియోగించే భవన సమూదాయాలకు హెచ్‌టీ సర్వీసు కింద సోలార్‌ ప్లాంట్లను బిగిస్తారు. ఉదాహరణకు ఓ గ్రామ పంచాయతీ కార్యాలయానికి నెలకు రూ. 2వేల కరెంటు బిల్లు వస్తుందనుకుంటే అందుకు ఎల్‌టీ సర్వీసు కింద 3-5 కిలోవాట్ల సామర్థ్యంతో కూడిన సోలార్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు. కలెక్టరేట్‌ సుమదాయ భవనం, పెద్దాసుపత్రుల వంటి విశాలమైన భవనాలకు హెచ్‌టీ సర్వీసు కింద 100 కిలోవాట్లకు పైగా సామర్థ్యం గల సోలార్‌ ప్లాంట్లను బిగిస్తారు. జిల్లాలో 1,772 ఎల్‌టీ, 8 హెచ్‌టీ సర్వీసులున్నట్లు అధికారులు గుర్తించారు.

- పాఠశాలల మాదిరిగా కావొద్దు..

గత ప్రభుత్వ హయాంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. తొలి విడతలో భాగంగా కొన్ని పాఠశాలల్ని ఎంపిక చేశారు. కానీ ప్రభుత్వం మారడంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీంతో సోలార్‌ ప్లాంట్ల కథ కంచికి చేరింది. ఇపుడు ప్రకటించిన పథకం పాఠశాల పథకంలా మారకూడదని ప్రజలు కోరుతు న్నారు. చిత్తశుద్ధితో అమలుకు చర్యలు తీసుకోవాలంటున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాల యాల్లో సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తే విద్యుత్‌ భారం తగ్గడమే కాకుండా ఆదా కానుంది.

నివేదికలు తయారు చేస్తున్నాం..

- వెంకటేష్‌ దోత్రే, జిల్లా కలెక్టర్‌

జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు నివేదికలు తయారు చేస్తున్నాం. ప్లాంట్ల ఏర్పాటుకు కావాల్సిన వైశాల్యం, నెలకు విద్యుత్‌ వినియోగం వంటి వివరాలను సంబందిత అధికారులు మూడు రోజుల్లోగా నివేదికలు ఇవ్వాలని ఆదేశించాం. నివేదికలు వచ్చిన వెంటనే ప్రభుత్వానికి పంపిస్తాం.

Updated Date - Aug 12 , 2025 | 10:45 PM