Cyber Investment Scam: సైబర్ మోసగాళ్ల వలకు చిక్కిన టెకీ
ABN , Publish Date - Sep 10 , 2025 | 04:19 AM
ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను సైబర్ నేరగాళ్లు మోసం చేసిన ఘటన తాజాగా వెలుగు చూసింది. గద్వాల జిల్లా ఉండవల్లి మండలం..
గ్రోయాప్‌లో రూ.22.30 లక్షల పెట్టుబడి హాంఫట్
గద్వాల జిల్లా ఉండవల్లి మండలంలో ఘటన
అలంపూరు చౌరస్తా, హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను సైబర్ నేరగాళ్లు మోసం చేసిన ఘటన తాజాగా వెలుగు చూసింది. గద్వాల జిల్లా ఉండవల్లి మండలం ఇటిక్యాలపాడుకు చెందిన వెంకటేశ్వరరెడ్డి.. వర్క్ ఫ్రం హోంలో భాగంగా సొంతూళ్లోనే ఉన్నాడు. రెండేళ్లుగా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతున్న బాధితుడు.. జూన్ 25న తన వాట్సా్‌పకు వచ్చిన లింక్ ఓపెన్ చేస్తే వచ్చిన గ్రోఅనే యాప్‌లో పెట్టుబడులతో అధిక లాభాలొస్తాయని నమ్మి తొలుత రూ.50 వేలు జమ చేశాడు. రెండ్రోజుల్లోనే రూ.2 లక్షల లాభం వచ్చినట్లు మెసేజ్ రావడంతో పొలం తనఖా పెట్టి మరీ.. 9 విడతల్లో మొత్తం రూ.22.30 లక్షలు జమ చేశాడు. రూ.50 లక్షల లాభం చూపడంతో విత్‌డ్రా చేసుకుంటానంటే రూ.13 లక్షల పన్ను చెల్లించాలన్న జవాబు రావడంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే, బజాజ్ ఫైనాన్స్‌లో రుణం ఇస్తామంటూ బురిడీ కొట్టించిన సైబర్ క్రిమినల్స్.. హైదరాబాద్ యూసఫ్‌గూడకు చెందిన వ్యక్తిని మోసం చేసి రూ. 3.04 లక్షలు కొల్లగొట్టారు.