Burgula Suman: సామాజిక వేత్త బూర్గుల సుమన కన్నుమూత
ABN , Publish Date - Oct 22 , 2025 | 05:17 AM
ఉపాధ్యాయురాలు, ఎంపీటీసీ, సర్పంచ్, సామాజిక వేత్తగా ప్రజాభిమానం పొందిన హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు వారసురాలు...
బూర్గుల రామకృష్ణారావు వారసురాలు
వైద్య కళాశాలకు భౌతికకాయం
షాద్‌నగర్ అర్బన్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయురాలు, ఎంపీటీసీ, సర్పంచ్, సామాజిక వేత్తగా ప్రజాభిమానం పొందిన హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు వారసురాలు బూర్గుల సుమన(88) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. బూర్గుల రామకృష్ణారావు సోదరుని కుమార్తె అయిన సుమన.. పెళ్లి చేసుకోకుండా తన జీవితాన్ని సామాజిక సేవకే అంకితం చేశారు. హైదరాబాద్‌లోని కేంద్రీయ విద్యాలయంలో ఉపాధ్యాయురాలిగా పనిచేసి 1998లో పదవీ విరమణ చేసి, రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలంలోని తన స్వగ్రామం బూర్గుల వచ్చారు. తన అన్న, సాయుధ రైతాంగ పోరాట యోధుడు బూర్గుల నర్సింగరావు స్ఫూర్తితో 2006లో బూర్గుల గ్రామ ఎంపీటీసీగా, 2013లో గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఓ వైపు ప్రజా సేవ చేస్తూనే మరో వైపు తన పూర్వ విద్యార్థుల సహకారంతో ప్రగతి వెల్ఫేర్ సొసైటీని స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. తాను మరణించిన కూడా తన శరీరం పదిమందికి ఉపయోగపడాలని సుమన కోరిక మేరకు.. కుటుంబసభ్యులు తన భౌతికకాయాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించారు.