Land Regularisation: సాదాబైనామా.. అరకొర ధీమా
ABN , Publish Date - Nov 06 , 2025 | 02:06 AM
సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం నత్తనడకన సాగుతోంది. క్రమబద్ధీకరణ చేయాలంటే అఫిడవిట్ తేవాల్సిందేనని అధికారులు చెబుతుండటంతో...
పెండింగ్‌లో 9 లక్షలకు పైగా దరఖాస్తులు.. ఇప్పటిదాకా క్రమబద్ధీకరించినవి 5 వేలే!
అఫిడవిట్ తప్పనిసరా కాదా అనే అంశంపైరాతపూర్వకంగా స్పష్టత ఇవ్వని సీసీఎల్‌ఏ
పంచనామా చేసి పని పూర్తి చేయాలన్నా..కొర్రీలు వేసి పెండింగ్ పెడుతున్న అధికారులు
హైదరాబాద్, నవంబరు 5 (ఆంధ్ర జ్యోతి): సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం నత్తనడకన సాగుతోంది. క్రమబద్ధీకరణ చేయాలంటే అఫిడవిట్ తేవాల్సిందేనని అధికారులు చెబుతుండటంతో ఆ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. అఫిడవిట్ తప్పనిసరి కాదని.. పంచనామా ద్వారా గ్రామంలో సంతకాలు సేకరించి.. క్రమబద్ధీకరణ చేయాలని సీసీఎల్‌ఏ అధికారులు ఆదేశించినా.. రాత పూర్వకంగా ఆదేశాలు రాలేదనే సాకుతో సమస్య పరిష్కారానికి తహసీల్దార్లే మోకాలడ్డుతున్నారనే విమర్శలు ఉన్నాయి. కొన్నిచోట్ల తండ్రి అఫిడవిట్ ఇచ్చినా వారసులు సంతకాలు పెట్టెందుకు సహకరించని పరిస్థితి ఎదురవుతోంది. దీంతోపాటు సాంకేతిక సమస్యలు కూడా అడ్డంకిగా మారుతున్నాయి. సీసీఎల్‌ఏ ఇచ్చిన సాఫ్ట్‌వేర్‌లో భూమి విక్రయించిన వ్యక్తి ఇంటి పేరు.. కొనుగోలుదారు ఇంటి పేరుగా వస్తోంది. ఈ సాంకేతిక లోపాన్ని సరిదిద్దాలని తహసీల్దార్లు సీసీఎల్‌ఏ కార్యాలయానికి ప్రతిపాదించినా ఇంకా సమస్య పరిష్కారం కాలేదని చెబుతున్నారు. సాదాబైనామా కింద విక్రయం చేసిన వ్యక్తి పేరు ఆన్‌లైన్‌లో లేకపోయినా, చనిపోయినా.. ఆన్‌లైన్‌లో ఆ వివరాల నమోదుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు వాపోతున్నారు. ఒకవేళ బతికి ఉంటే.. ఆ వ్యక్తి ఆధార్ నంబరు నమోదు చేస్తే తప్ప.. విక్రయదారుని వివరాల నమోదుకు వీలుకాని పరిస్థితి. ఒకే సర్వే నంబరులో ఉన్న భూమిని ఒకరి కంటే ఎక్కువ మంది పేరుతో సాదాబైనామా చేసిన కేసులను పరిశీలించకుండా పక్కన పడేస్తున్నారు. నవంబరు 5 నాటికి సాదాబైనామా దరఖాస్తుల పరిస్థితిని పరిశీలిస్తే.. మొత్తం 9,00,880 దరఖాస్తులకు గాను 8,99,032 దరఖాస్తులకు నోటీసులు జారీ చేశారు. 1848 దరఖాస్తులకు నోటీసులు ఇవ్వాల్సి ఉంది. మొత్తం దరఖాస్తుల్లో తహసీల్దార్ నుంచి ఆర్డీవో లాగిన్‌కు పంపినవి 32,030. ఇందులో ఆమోదించిన దరఖాస్తులు కేవలం 5,295. పెండింగ్‌లో పెట్టినవి 26,735 ఉన్నాయి. తహసీల్దార్ నుంచి ఆర్డీవోకు వెళ్లిన దరఖాస్తుల్లో కేవలం 17 శాతమే ఆమోదించారు. 8,99,032 నోటీసులిచ్చిన అధికారులు.. కేవలం 4ు దరఖాస్తులే(32030) తహసీల్దార్ నుంచి ఆర్డీవో లాగిన్‌కు పంపారు.
అత్యధికం.. ఖమ్మం జిల్లా నుంచే
సాదాబైనామాకు సంబంధించిన దరఖాస్తుల్లో ఒక్క ఖమ్మం జిల్లా నుంచే అత్యధికంగా 1,11,442 దరఖాస్తులు వచ్చాయి. ఈ జిల్లాలో తహసీల్దార్ లాగిన్ నుంచి ఆర్డీవో లాగిన్‌కు వెళ్లిన దరఖాస్తులు కేవలం 51. ఇందులో ఏ ఒక్క దరఖాస్తునూ ఇప్పటి వరకూ ఆమోదించలేదు. సూర్యాపేట జిల్లాలో 81,626 దరఖాస్తులు రాగా తహసీల్దార్ లాగిన్ నుంచి ఆర్డీవోకు పంపినవి 491. వాటిలో 65 దరఖాస్తులను ఆమోదించగా 426 పెండింగ్‌లో పెట్టారు. ఒక్క దరఖాస్తు కూడా ఆమోదించని జిల్లాల జాబితాలో రంగారెడ్డి, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, వికారాబాద్, నిర్మల్, హనుమకొండ, వరంగల్, నాగర్‌కర్నూల్, నిజామాబాద్, భద్రాది కొత్తగూడెం, ములుగు, మేడ్చల్ మల్కాజ్‌గిరి, పెద్దపల్లి, కుమ్రంభీం అసిఫాబాద్, ఖమ్మం ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 5,541 దరఖాస్తులు రాగా అందులో తహసీల్దార్ నుంచి ఆర్డీవో లాగిన్‌కు వెళ్లినవి 69. వరంగల్ జిల్లాలో 53,996 దరఖాస్తులకు గాను కేవలం ఒకే ఒక్క దరఖాస్తు తహసీల్దార్ నుంచి ఆర్డీవోకి వెళ్లింది. అది కూడా పెండింగ్‌లోనే ఉంది. సిద్దిపేట జిల్లాలో 44,583 దరఖాస్తులు రాగా.. అత్యధికంగా 11,652 దరఖాస్తులు తహసీల్దార్ నుంచి ఆర్డీవో లాగిన్‌కు వెళ్లాయి. వాటిలో 8832 దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టారు.. 2,820 దరఖాస్తులను ఆమోదించారు. అత్యధిక సాదాబైనామా దరఖాస్తులు ఆమోదించిన జిల్లా ఇదొక్కటే. దీని తరువాత స్థానంలో సంగారెడ్డి జిల్లా (దరఖాస్తులు 8,446; ఆమోదించినవి 2,550) ఉంది.