Share News

Transparency In Registration: అప్పుడు మూడు గంటలు.. ఇప్పుడు అరగంటే

ABN , Publish Date - Apr 11 , 2025 | 03:58 AM

స్లాట్‌ బుకింగ్‌ విధానం ద్వారా అవినీతిని నివారించడంతో పాటు, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ సులభతరం చేయబడిందని మంత్రి పొంగులేటి చెప్పారు.ప్రజల స్పందన ఆధారంగా విధానాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు.

Transparency In Registration: అప్పుడు మూడు గంటలు.. ఇప్పుడు అరగంటే

  • స్లాట్‌ విధానంతో సులభంగా రిజిస్ట్రేషన్లు

  • ప్రయోగాత్మకంగా 22 సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయాల్లో అమలు

  • తొలి రోజు 626 రిజిస్ట్రేషన్లు

  • అవినీతికి తావు లేకుండా విధానం

  • మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

  • కొత్త విధానంపై వినియోగదారుల హర్షం

  • తమ ఉపాధికి దెబ్బపడుతోందంటూ డాక్యుమెంట్‌ రైటర్ల ఆందోళన

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, చంపాపేట, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): వేగంగా, పారదర్శకంగా సేవలు అందించేందుకు రిజిస్ట్రేషన్‌ శాఖ తీసుకొచ్చిన స్లాట్‌ విధానానికి తొలి రోజు గురువారం మంచి స్పందన వచ్చింది. ప్రయోగాత్మకంగా 22 సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురాగా మొదటిరోజు 626 రిజిస్ట్రేషన్లు జరిగాయి. కొత్త విధానంపై క్రయవిక్రయదారుల్లో సంతృప్తి వ్యక్తమవుతోంది. పది, పదిహేను నిమిషాల్లోనే ఆస్తుల రిజిస్ట్రేషన్‌ పూర్తయిందని వారు తెలిపారు. గతంలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయ్యాక దస్తావేజులు తీసుకునేందుకు రోజుల తరబడి వేచి ఉండాల్సి వచ్చేదని.. కొత్త విధానంతో రిజిస్ట్రేషన్‌ పూర్తయిన వెంటనే చేతికి ఇవ్వడం బాగుందని పేర్కొన్నారు. నూతన విధానం అమలు తొలిరోజు ఎటువంటి ఆటంకాలు ఎదురుగాకపోవడంతో రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు స్లాట్‌ బుకింగ్‌ విధానంలో వినియోగదారులే స్వయంగా డాక్యుమెంట్లు తయారు చేసుకునే వెసులుబాటు ఉండటంతో.. తమ ఉపాధికి దెబ్బపడుతోందంటూ కొన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద డాక్యుమెంట్‌ రైటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. స్లాట్‌ బుకింగ్‌తోపాటు సమాంతరంగా పాత పద్ధతిని కూడా కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.


అవినీతి లేకుండా, పారదర్శకంగా: పొంగులేటి

స్లాట్‌ బుకింగ్‌ విధానంపై ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ముందుకు వెళతామని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తొలిరోజు స్లాట్‌ బుకింగ్‌ జరిగిన తీరు, ఎదురైన ఇబ్బందులు, ప్రజల స్పందనపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. స్లాట్‌ బుకింగ్‌ విధానంపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. స్లాట్‌ బుకింగ్‌ విధానం వల్ల దళారులను ఆశ్రయించాల్సిన పనిలేదని, ఎవరి సిఫార్సు లేకుండా, పైసా అవినీతికి అవకాశం లేకుండా రిజిస్ట్రేషన్‌ పూర్తయిపోతుందని స్పష్టం చేశారు.

స్లాట్‌ విధానం బాగుంది

రిజిస్ట్రేషన్‌కు స్లాట్‌ బుకింగ్‌ విధానం బాగుంది. అన్ని వివరాలను ముందే ఆన్‌లైన్‌లో నమోదు చేయడం వల్ల సమయం ఆదా అయింది. 20 నిమిషాల్లోనే మా రిజిస్ట్రేషన్‌ పూర్తయింది.

- గట్టు శ్రీనివాస్‌, మల్కాజ్‌గిరి

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద

ఇలాగే కొనసాగించాలి

స్లాట్‌ బుకింగ్‌ విధానాన్ని ఇలాగే కొనసాగించాలి. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ సాఫీగా అయిపోయింది. నా స్లాట్‌ సమయంలో కొన్ని పత్రాలు ఇవ్వలేకపోవడంతో ఆ సమయాన్ని నా తర్వాతి వారికి ఇచ్చాను.. అధికారుల సాయంతో గంట తర్వాత నా రిజిస్ట్రేషన్‌ కూడా జరిగింది.

- ఘనశ్యామ్‌ పటేల్‌, శంషాబాద్‌

సబ్‌రిజిస్టార్‌ కార్యాలయం వద్ద

అరగంటలో వచ్చేశాం

మా తనఖా (మార్టిగేజ్‌) రిజిస్ట్రేషన్‌ సులువుగా అయింది. ఆస్తి తనఖా కోసం గతంలో 3, 4 గంటలు వేచి చూడాల్సి వచ్చింది. ఇప్పుడు కేటాయించిన సమయానికి వెళ్లాం. అరగంటలో పని పూర్తయింది.

- సి.స్వాతి, వల్లభనగర్‌

సబ్‌రిజిస్టార్‌ కార్యాలయం వద్ద

Updated Date - Apr 11 , 2025 | 03:59 AM