Sleeping Pods Introduced at Charlapalli: చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్
ABN , Publish Date - Dec 25 , 2025 | 05:06 AM
రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందించే దిశగా దక్షిణ మధ్య రైల్వే ముందుకు సాగుతోంది....
చౌకగా విమానాశ్రయాల్లోని ఎగ్జిక్యూటివ్ లాంజ్ తరహా వసతి
మహిళలు, పురుషులకు వేర్వేరుగా 16 చొప్పున సింగిల్ బెడ్లు
2 గంటలకు 200.. రోజుకు 1200
ఫ్రీ వైఫై, లాకర్ సదుపాయాలు
తాజాగా గుంటూరు స్టేషన్‌లోనూ..
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందించే దిశగా దక్షిణ మధ్య రైల్వే ముందుకు సాగుతోంది. ప్రయాణికుల అలసట తీర్చేందుకు తక్కువ ధరలో మెరుగైన వసతి సదుపాయాలతో చర్లపల్లి రైల్వే టెర్మినల్‌లో స్లీపింగ్ పాడ్స్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. తాజాగా గుంటూరు రైల్వేస్టేషన్‌లోనూ ఈ సదుపాయాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో ఈ సౌకర్యం ద్వారా ప్రయాణికులకు సురక్షిత, విలాసవంతమైన స్వల్పకాలిక వసతి లభిస్తోంది. విమానాశ్రయాల్లో ఉండే ఎగ్జిక్యూటివ్ లాంజ్ తరహాలో ఇందులో సౌకర్యాలు ఉంటాయి. చర్లపల్లి రైల్వే టెర్మినల్‌లో మొత్తం 32 సింగిల్ బెడ్‌లు ఉండగా, వీటిలో మహిళలకు, పురుషులకు వేర్వేరుగా 16 చొప్పున కేటాయించినట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ సౌకర్యానికి 2 గంటలకు రూ.200, 6 గంటలకు 400, 12 గంటలకు రూ.800, 24 గంటలు (ఒకరోజు)రూ.1200 చొప్పున చార్జీలను నిర్ణయించామన్నారు. స్లీపింగ్ పాడ్స్ సదుపాయంతో ప్రయాణికులు ఉచిత వైఫై, 24 గంటల పాటు వేడి నీటి సరఫరా, స్నాక్స్ బార్, ట్రావెల్ డెస్క్, విశాలమైన, పరిశుభ్రమైన బెడ్‌లు, శుభ్రమైన టాయిలెట్‌లు, లగేజీని సురక్షితంగా ఉంచుకునేందుకు లాకర్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని వివరించారు. ఈ సౌకర్యవంతమైన బసను అవసరమైన ప్రయాణికులు వినియోగించుకోవాలని శ్రీవాస్తవ కోరారు. ప్రయాణికులు స్వల్పకాలిక విశ్రాంతి తీసుకునేందుకు స్లీపింగ్ పాడ్స్ సదుపాయం ఎంతో ఉపకరిస్తుందని సీపీఆర్‌వో శ్రీధర్ పేర్కొన్నారు. తొలుత సెంట్రల్ రైల్వే పరిధిలోని ముంబై రైల్వేస్టేషన్‌లో ఈ తరహా సదుపాయాన్ని ప్రారభించగా.. ఎంతో ఆదరణ లభించిందన్నారు.