Minister Uttam Kumar Reddy: 2027 డిసెంబరుకు ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పూర్తి
ABN , Publish Date - Sep 10 , 2025 | 04:21 AM
ఎస్‌ఎల్‌బీసీ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) సొరంగం తవ్వకాన్ని 2027 డిసెంబరు నెలాఖరుకు పూర్తిచేస్తామని నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పునరుద్ఘాటించా..
డిండి ఎత్తిపోతల పథకం కూడా పూర్తి చేస్తాం : నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఎల్‌బీసీ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) సొరంగం తవ్వకాన్ని 2027 డిసెంబరు నెలాఖరుకు పూర్తిచేస్తామని నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పునరుద్ఘాటించారు. దీనిద్వారా 4 లక్షల ఎకరాలకు గ్రావిటీతో సాగునీటిని, సురక్షితమైన తాగునీటిని అందిస్తామన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నెలకు రూ.1.2 కోట్ల కరెంట్ బిల్లుల భారం తప్పుతుందని ఆయన తెలిపారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి మంగళవారం జలసౌధలో ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష జరిపారు. టన్నెల్ కోసం మ్యాగ్నెటిక్ సర్వేను వేగవంతం చేయాలన్నారు. టన్నెల్ పునరుద్ధరణపై అధికారులు రూపొందించిన నివేదిక, సవరణ అంచనాలపై 15వ తేదీన జరుగనున్న మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు ప్రకటించారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పూర్తయితే హైలెవల్ కెనాల్ ద్వారా ఉదయసముద్రం ప్రాజెక్టుకు నీటిని తరలించి, లక్ష ఎకరాలకు సాగునీటిని అందిస్తామన్నారు. లోలెవల్ కెనాల్ ద్వారా 80,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. ఇక డిండి ఎత్తిపోతల పథకం పూర్తి చేయడం ద్వారా 8 రిజర్వాయర్ల కింద 3.61 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పనులు చేస్తున్నామన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ఏదుల రిజర్వాయర్ నుంచి దుందుభి నదిలో నీటిని పోసి... రబ్బర్ డ్యామ్ కట్టి, నీటిని డిండి ఎత్తిపోతల పథకం కింద మళ్లిస్తామని, ఈ పనులను ఐదు ప్యాకేజీలుగా విభజించి చేస్తున్నామని చెప్పారు. ఎస్‌ఎల్‌బీసీకి అనుబంధంగా నిర్మించిన ఉదయసముద్రం పనులు ఇప్పటికే 70 శాతం మేర పూర్తికాగా.. మిగిలిన పనుల పూర్తిపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. బస్వాపూర్ రిజర్వాయర్ పనులు 93 శాతం మేర పూర్తయ్యాయని.. గంధమల్ల రిజర్వాయర్ పరిధిలోని రావల్‌కోల్ లింక్ కెనాల్, తురకపల్లి పనులు పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇప్పటికే నిర్మాణంలో ఉండి.. తుది దశలో ఉన్న ప్రాజెక్టులకు నిధు లు కేటాయించాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కోరారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్ టన్నెల్: కోమటిరెడ్డి
ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పూర్తయితే ప్రపంచంలో అతిపెద్ద ఇరిగేషన్ టన్నెల్‌గా నిలవనుందని మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. రాజకీయ దురుద్దేశంతో పదేళ్లు ఈ ప్రాజెక్టును పక్కనపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నార్కట్‌పల్లి మండ లం జిల్లాలో ఫ్లోరైడ్ ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఒకటని.. అందుకే బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టు చేపట్టామని గుర్తుచేశారు. రూ.3 వేల కోట్లు ఖర్చుచేస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రాజెక్టున్నీ పూర్తవుతాయన్నారు.