J Prakash Narayan: 90శాతం డిగ్రీ పట్టాలు చిత్తుకాగితాలతో సమానం
ABN , Publish Date - Dec 01 , 2025 | 05:57 AM
మన దేశంలో నూటికి 90శాతం మంది డిగ్రీ పట్టాలు చిత్తుకాగితాలతో సమానమని, అవి నిరర్ధకమైనవని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. నైపుణ్యాలు అందించని డిగ్రీ పట్టాలు నాలుకగీసుకోవడానికీ....
నైపుణ్యాలు అందించని డిగ్రీలు నాలుక గీసుకోవడానికీ పనికిరావు
ప్రభుత్వ ఉద్యోగమే సర్వస్వం అనుకునేవాళ్లు మూర్ఖులు
వదాన్య స్వచ్ఛంద సంస్థ వార్షికోత్సవంలో జయప్రకాశ్ నారాయణ
వదాన్య సేవలను కొనియాడిన ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణప్రసాద్
హైదరాబాద్ సిటీ, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): మన దేశంలో నూటికి 90శాతం మంది డిగ్రీ పట్టాలు చిత్తుకాగితాలతో సమానమని, అవి నిరర్ధకమైనవని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. నైపుణ్యాలు అందించని డిగ్రీ పట్టాలు నాలుకగీసుకోవడానికీ పనికిరావని చెప్పారు. సమాజ పురోగతికి కావాల్సింది పట్టాలుకాదని.. సృజనాత్మకత, ఉత్పత్తి సామర్థ్యాలు, క్రిటికల్ థింకింగ్, సమస్య పరిష్కారం వంటి నైపుణ్యాలన్నారు. దేశంలో 24 కోట్ల మంది పాఠశాలల్లో ఉన్నారని, వారిలో నూటికి ఎనభై మంది భవిష్యత్తు ప్రశ్నార్ధకమేనని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థంటే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, కోర్టుకేసులేనా అని ఆయన ప్రశ్నించారు. పిల్లల పేరుతో దేశంలో ఒక డ్రామా నడుస్తోందని మండిపడ్డారు. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ.లక్షకుపైగా వెచ్చిస్తున్నా, కనీస విద్యాప్రమాణాలు అందడంలేదని జయప్రకాశ్ నారాయణ (జేపీ) ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాలయాల్లో పేరుకే పరీక్షలు జరుగుతున్నాయన్నారు. బట్టీయం లేదా కాపీ కొట్టడమే తప్ప ఉత్తీర్ణత పొందినవారిలో 20శాతంమందికి మించి మిగతా విద్యార్థులకు సబ్జెక్టుల్లో కనీస పరిజ్ఞానం ఉండడం లేదన్న పలు అధ్యయనాలను ఉదహరించారు. వదాన్య స్వచ్ఛంద సంస్థ 15వ వార్షికోత్సవం ఆదివారం గచ్చిబౌలీలోని ఈఎ్‌ససీఐ ఆడిటోరియంలో జరిగింది. ముఖ్య వక్తగా జేపీ మాట్లాడుతూ..ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే సర్వస్వంగా భావించేవారంతా పరమమూర్ఖులు అన్నారు. పాలకులు ఉద్యోగాలు ఇస్తామని అబద్ధపు వాగ్దానాలు ఇచ్చి యువతను మభ్యపెడుతున్నారని, ప్రభుత్వ ఉద్యోగాల మోజు సమాజాన్ని అల్లకల్లోలం చేస్తోందని చెప్పారు. జిల్లా కలెక్టరుకన్నా ఇంటి మరుగుదొడ్డిలో తూము పూడికతీసే ప్లంబరు మిన్న అన్న విషయాన్ని గుర్తించాలని జేపీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. పేదవర్గాల్లోని ప్రతిభావంతులను గుర్తించి, వారి చదువుకు ఆర్థిక సహాయం అందిస్తున్న వదాన్య జనసొసైటీ సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. అశోక్ పడపాటి బృందం యువతకు ఆదర్శనీయమని పేర్కొన్నారు. ప్రముఖ సినీ దర్శకుడు హను రాఘవపూడి, సినీ రచయిత బీవీఎస్ రవి.. వదాన్యతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చినాబ్ రైల్వే వంతెన ఇంజనీరు గాలి మాధవీలత మాట్లాడుతూ పేదరికం వల్ల ఉన్నత చదువులకు దూరమవుతున్న యువతను గుర్తించి సరైన అవకాశాలు కల్పించడం గొప్ప విషయమన్నారు. ఐఎ్‌ఫఎస్ అధికారిణి సువర్ణ మాట్లాడుతూ విలువైన సమయాన్ని సమాజ శ్రేయస్సు కోసం కేటాయిస్తున్న వదాన్య వలంటీర్లను అభినందించారు. వదాన్య వ్యవస్థాపకుడు అశోక్ పడపాటి మాట్లాడుతూ ఇప్పటివరకు తమ సంస్థ సేవలు పొందిన వారిలో 100మందిపైగా ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారని, వారిలో 50మంది ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైనట్టు తెలిపారు. ఉన్నత చదువుకు ఆర్థిక సహకారం, ల్యాప్‌టాప్‌ల పంపిణీతోపాటు పోటీపరీక్షల అభ్యర్థులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జి.రామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.