Share News

Encounter in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌..ఆరుగురు మావోయిస్టుల మృతి

ABN , Publish Date - Nov 12 , 2025 | 03:19 AM

త్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా ఇంద్రావతి నేషనల్‌ పార్కు అడవుల్లో మంగళవారం ఉదయం మావోయిస్టులు, కేంద్ర బలగాలకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు....

Encounter in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌..ఆరుగురు మావోయిస్టుల మృతి

  • మృతుల్లో ఇంద్రావతి నేషనల్‌ పార్కు ఏరియా కమిటీ ఇన్‌చార్జి బుచ్చన్న.. పాపారావు భార్య ఊర్మిళ?

  • తప్పించుకున్న మద్దేడు ఏరియా కమిటీ కమాండ్‌ పాపారావు?

  • తప్పించుకున్న వారికోసం గాలింపు: బస్తర్‌ ఐజీ సుందర్‌ రాజ్‌

చర్ల/చింతూరు, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా ఇంద్రావతి నేషనల్‌ పార్కు అడవుల్లో మంగళవారం ఉదయం మావోయిస్టులు, కేంద్ర బలగాలకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. నేషనల్‌పార్క్‌ అటవీ ప్రాంతంలో దాదాపు 25మంది మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో బీజాపూర్‌, దంతెవాడ జిల్లాలకు చెందిన డీఆర్‌జీ, ఎస్టీఎఫ్‌ బలగాలు మంగళవారం సంయుక్త ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ క్రమంలోనే ఎన్‌కౌంటర్‌ జరిగింది. మృతుల్లో మోస్ట్‌ వాంటెడ్‌, మద్దేడు ఏరియా కమిటీ కమాండర్‌ పాపారావు భార్య ఊర్మిళ, నేషనల్‌ పార్కు ఏరియా కమిటీ ఇన్‌చార్జి బుచ్చన్న ఉన్నట్లు తెలుస్తోంది. ఊర్మిళ మద్దేడు ఏరియా కమిటీ సభ్యురాలుగా పనిచేస్తున్నట్టు సమాచారం. ఈ ఘటనలో పాపారావు తప్పించుకొన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్‌కౌంటర్‌తో దక్షిణ బస్తర్‌ ప్రాతంలోని నేషనల్‌ పార్క్‌ పరిధిలో ఉన్న ఎయిడెడ్‌ కమిటీ దాదాపుగా తుడుచుపెట్టుకుపోయిందని పోలీసులు చెబుతున్నారు. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోయిస్టుల్లో ముగ్గురు మహిళలున్నారు. పోలీసులు ఘటనా స్థలం నుంచి పలు తుపాకులు, స్టెన్‌గన్‌, ఇన్సాస్‌ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్‌లో తప్పించుకున్న మావోయిస్టుల కోసం అదనపు బలగాలను పంపించామని, కూంబింగ్‌ ముగిసిన తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని బస్తర్‌ ఐజీ సుందర్‌ రాజ్‌ తెలిపారు. కొద్ది రోజుల క్రితం ఆశన్నతో కలిసి పలువురు మావోయిస్టులు లొంగిపోయారు. వీరంతా నేషనల్‌ పార్కు అడవుల నుంచి వచ్చారు. వారిచ్చిన సమాచారం ఆధారంగానే బలగాలు ఈ ఆపరేషన్‌ చేపట్టినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు, బీజాపూర్‌ జిల్లా తార్లగూడ పోలీస్టేషన్‌ పరిధిలోని అన్నారం అడవుల్లోనూ మంగళవారం మావోయిస్టులు, పోలీసు బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. గాయాలతో పలువురు మావోయిస్టులు బలగాలకు పట్టుబడ్డట్లు సమాచారం.


హిడ్మా కోసం వేల బలగాలు

మార్చి 31కల్లా మావోయిస్టు పార్టీని నిర్మూలించాలన్న లక్ష్యంతో కేంద్రం ప్రారంభించిన ఆపరేషన్‌ కగార్‌కు గడువు ఇంకా 5 నెలలు మాత్రమే మిగిలి ఉంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా జాడను పోలీసులు ఇంతవరకు కనుక్కోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే తాజా గా వేల మంది బలగాలను రంగంలోకి దింపారు. పామేడు, అబూజ్‌మడ్‌, నేషనల్‌ పార్కు, కర్రెగుట్టల్లో గాలింపు ముమ్మరం చేశారు. హిడ్మా లొంగి పోవాలని, హిడ్మా ఇంటికెళ్లి ఛత్తీ్‌సగఢ్‌ హోంమంత్రి విజయశర్మ ఇటీవలే కోరారు. అడవుల్లో ఇంకా సాయుధ పోరాటం చేస్తున్న కేంద్ర కమిటీ సభ్యులు గణపతి, బెహరా, పశులూరి విశ్వనాథం, కాకా హనుమంతు, మల్లా రాజిరెడ్డి, అనల్‌ధా, రణదేవ్‌, గోసం గాలింపు ముమ్మరం చేశారు. ప్రత్యేక శాటిలైట్‌ చిత్రాల ద్వారా వారి జాడను కనుగొంటున్నారు.

Updated Date - Nov 12 , 2025 | 03:19 AM