Minister Sitakka: క్యాబినెట్ సమావేశంలో..రాద్దాంతం జరిగిందని నిరూపించగలవా?
ABN , Publish Date - Oct 18 , 2025 | 04:59 AM
నా తల్లిదండ్రులు సమ్మక్క.. సమ్మయ్యలపై ప్రమాణం చేసి చెబుతున్నా.. గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఎలాంటి రాద్దాంతమూ జరగలేదు..
హరీశ్‌రావుకు సీతక్క సవాల్
హైదరాబాద్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : ‘‘నా తల్లిదండ్రులు సమ్మక్క.. సమ్మయ్యలపై ప్రమాణం చేసి చెబుతున్నా.. గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఎలాంటి రాద్దాంతమూ జరగలేదు. సమావేశం అజెండా.. ప్రజల సమస్యలపైన తప్ప ఇంక దేనిపైనా చర్చ జరగలేదు. మంత్రివర్గ సమావేశంలో రాద్దాంతం జరిగిందంటున్న హరీశ్‌రావు.. దాన్ని నిరూపించగలరా?’’ అంటూ మంత్రి సీతక్క సవాల్ విసిరారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో శుక్రవారంనాడు సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. జరగని విషయాలు జరిగినట్లు చెబుతూ హరీశ్‌రావు తన స్థాయిని దిగజార్చుకున్నారన్నారు. నిన్న వ్యక్తిగతంగా సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడినప్పుడు కూడా ఇతర మంత్రులపై చర్చ చేయలేదన్నారు. అబద్ధాలకు ఆరడుగుల సాక్ష్యం హరీశ్‌రావన్నారు. కేసీఆర్ హయాంలో మంత్రవర్గ సమావేశాలు తూతూమంత్రంగా జరిగేవన్నారు. కేసీఆర్ కూతురు కవిత.. హరీశ్‌రావుపై అనేక ఆరోపణలు చేశారని, వాటికి ఆయన సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో గన్ కల్చర్‌ను తీసుకువచ్చింది.. నడిరోడ్డుపైన అడ్వకేట్లను చంపిందీ బీఆర్‌ఎస్ పార్టీనేనని ఆరోపించారు. ‘‘బీఆర్‌ఎస్ హయాంలో ఇబ్రహీంపట్నంలో రియల్ ఎస్టేట్ గొడవల్లో తుపాకులతో కాలిస్తే ఇద్దరు చనిపోయారు. హరీశ్‌రావు సొంత నియోజకవర్గం సిద్దిపేట కేంద్రంలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ ఆవరణలో తుపాకీతో కాల్పులు జరిపి రూ.42 లక్షలు ఎత్తుకుపోయారు.’’ అని గుర్తుచేశారు. కేసీఆర్ హయాంలో మంత్రులంతా పంజరంలో చిలుకలేనని, వారికి మాట్లాడే స్వేచ్ఛ లేదన్నారు.