Phone Tapping: 6 వేల ఫోన్ నంబర్లు
ABN , Publish Date - Dec 25 , 2025 | 05:18 AM
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విచారణ అంతా ఓ పెన్‌డ్రైవ్ చుట్టూ సాగుతోంది. ట్యాపింగ్ కోసం అధికారిక అనుమతులు పొందిన నంబర్లు కొన్నేకాగా..
ట్యాపింగ్ కేసులో స్వాధీనం చేసుకున్న పెన్‌డ్రైవ్‌లో గుర్తింపు
అధికారిక అనుమతులు గోరంత.. ట్యాపింగ్ కొండంత
ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో అధికారికంగా కొన్ని..
నాటి మంత్రులు అనధికారికంగా ఇచ్చినవి మరికొన్ని..
ఎస్‌ఐబీ అధికార్లు వ్యక్తిగతంగా ట్యాప్ చేసినవి ఇంకొన్ని..
నాటి సీఎంవో, ఇద్దరు మంత్రుల పాత్రపై ఆధారాలు
విచారణలో సహకరించని ప్రభాకర్‌రావు
హైదరాబాద్, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విచారణ అంతా ఓ పెన్‌డ్రైవ్ చుట్టూ సాగుతోంది. ట్యాపింగ్ కోసం అధికారిక అనుమతులు పొందిన నంబర్లు కొన్నేకాగా.. అనధికారికంగా వేలాది ఫోన్లను ట్యాప్ చేసిన గుట్టు ఆ పెన్‌డ్రైవ్ ద్వారా సిట్ చేతికి చిక్కినట్టు తెలిసింది. మావోయిస్టుల పేరిట ప్రముఖుల ఫోన్ నంబర్లేకాకుండా ఎలాంటి అనుమతులు పొందకుండా యథేచ్ఛగా వ్యక్తుల జీవితాల్లోకి ప్రభాకర్‌రావు బృందం చొచ్చుకుని వెళ్లిన వికృతక్రీడకు ఆధారాలను గుర్తించినట్టు సమాచారం. అలా పదో, వందో కాదు.. ఏకంగా ఆరు వేలకుపైగా నంబర్లను ట్యాప్ చేశారని తెలిసింది. ఈ క్రమంలో సాంకేతిక ఆధారాలతో కేసు విచారణను ముందుకు తీసుకెళ్లడానికి దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఓ మీడియా ఛానల్ యజమాని కార్యాలయంలో ఏర్పాటు చేసిన అనధికార ట్యాపింగ్ కేంద్రానికి సంబంధించిన ఆధారాలను తాజాగా సిట్ అధికారులు సమీక్షిస్తున్నట్టు తెలిసింది. సిట్ అధికారులు తాజాగా స్వాధీనం చేసుకున్న పెన్‌డ్రైవ్‌లో ఆరువేలకుపైగా వ్యక్తుల ఫోన్ నంబర్లు, ప్రొఫైల్స్ ఉన్నట్టు సమాచారం. ఈ ఫోన్ నంబర్లలో నాటి ప్రభుత్వ పెద్దలు పంపినవి ఎన్ని? అనధికారికంగా ఓ మాజీ మంత్రి పంపించిన ఫోన్ నంబర్లు ఎన్ని ఉన్నాయనేది సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు.
ఒకదానికొకటి లింక్ చేసుకుంటూ..
ఫోన్ ట్యాపింగ్ కేసును భిన్న కోణాల్లో చూడాల్సిన పరిస్థితి నెలకొందని సిట్ అధికారులు చెబుతున్నారు. నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో జరిగిన ట్యాపింగ్ ఒకటైతే.. ప్రభాకర్‌రావు బృందానికి అనధికారికంగా ఫోన్ నంబర్లు ఇచ్చి ట్యాపింగ్ చేయించిన మాజీ మంత్రులది మరో కోణమని, వాటికి అదనంగా వ్యక్తిగతంగా ఎస్‌ఐబీ అధికారులు ట్యాపింగ్ చేసినవి మరికొన్ని ఉన్నాయని అంటున్నారు. వీటిని ఒకదానికొకటి లింక్ చేసుకుంటూ వెళ్లడం ద్వారా ట్యాపింగ్ లక్ష్యాలను గుర్తించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఈ కేసులో అరెస్టయిన పోలీసు అధికారుల వాంగ్మూలాల ఆధారంగా ఇద్దరు మాజీ మంత్రులు, నాటి సీఎంవో పాత్రకు సంబంధించిన ఆధారాలు లభించాయని.. వాటి ఆధారంగా నోటీసులు జారీ చేసే అంశంపై న్యాయనిపుణుల అభిప్రాయం తీసుకోవాలని సిట్ భావిస్తున్నట్టు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్‌కు కర్త, కర్మ, క్రియ ఒక్కరేకాదని, కొంత మంది ఉన్నారని ఒక నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. ప్రభాకర్‌రావును బుధవారం సిట్ అధికారులు ప్రశ్నించినపుడు సిట్ బృందంలోని ఇద్దరు ఐపీఎస్ అధికారులు పాల్గొన్నట్టు తెలిసింది. కీలక ఆధారాలను ఆయన ముందుంచి ప్రశ్నించారని, అయినా ప్రభాకర్‌రావు నుంచి అరకొరగానే సమాధానాలు వచ్చాయని సమాచారం.