Phone Tapping Case: ప్రభాకర్‌రావును సుదీర్ఘంగా విచారించిన సిట్
ABN , Publish Date - Dec 14 , 2025 | 06:52 AM
ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును సిట్ అధికారులు రెండోరోజు సుదీర్ఘంగా విచారించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సాంకేతిక ఆధారాలతో ప్రశ్నలు
పెదవి విప్పని ప్రభాకర్ రావు.. అన్నీ అరకొర సమాధానాలే
హైదరాబాద్, డిసెంబర్ 13(ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును సిట్ అధికారులు రెండోరోజు సుదీర్ఘంగా విచారించారు. ఆయన ఉపయోగించిన ఫోన్లు, ల్యాప్‌టాప్, జీమెయిల్ ఖాతాలు, ఐ క్లౌడ్ ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని పూర్తి స్ధాయిలో తెలుసుకోవడం కోసం సిట్ అధికారులు ప్రయత్నించారు. ఎన్ని రకాలుగా ప్రశ్నలు వేస్తున్నా.. తనకు తెలిసిన విషయాలను ఇప్పటికే చెప్పానని, అంతా నిబంధనల మేరకే తాను వ్యవహరించానని ఆయన పదేపదే చెబుతున్నట్లు సమాచారం. విచారణ మొత్తం వీడియో రికార్డు చేస్తున్న నేపధ్యంలో సిట్ అధికారులు ప్రభాకర్ రావుపై ఒక్కో ప్రశ్న సంధిస్తున్నారని తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆదేశాలెక్కడి నుంచి వచ్చాయు? నాటి సీఎంఓలోని ఏయే అధికారులు నేరుగా మీకు ఫోన్ చేసేవారు? ఆ ఫోన్ కాల్స్ మీకు కేటాయించిన ఆఫీసు నెంబర్‌కు వచ్చాయా? లే క మీ వ్యక్తిగత ఫోన్ నెంబర్‌కు వచ్చాయా అని ప్రశ్నించినపుడు ప్రభాకర్‌రావు చాలావరకు ఆఫీసు ఫోన్ నుంచే ఉన్నతాధికారులతో మాట్లాడతానని వివరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొన్ని సెల్‌ఫోన్ కాల్స్‌కు సంబంధించి టవర్ లొకేషన్లు చూపిస్తూ ఆ సమయంలో మీరెందుకు అక్కడున్నారు? మీతో ఉన్న వాళ్లెవరు? అనే ప్రశ్నలను సిట్ అధికారులు సంధించినట్లు తెలుస్తోంది. విచారణ చివరిదశకు చేరినపుడు కీలకమైన సాంకేతిక ఆధారాలతో కూడిన ప్రశ్నలను సంధించడానికి పోలీసు ఉన్నతాధికారులు సిద్ధమైనట్లు సమాచారం.