Phone Tapping Case: ట్యాపింగ్ ఆదేశాలను మీరే చేరవేసేవారా
ABN , Publish Date - Nov 28 , 2025 | 04:15 AM
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ఓఎస్డీ రాజశేఖర్‌రెడ్డిని సిట్ అధికారులు గురువారం విచారించారు. జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్‌లోని సిట్ ఆఫీసులో సుమారు రెండు గంటల పాటు వివిధ అంశాలపై ప్రశ్నించారు...
నాటి సీఎం కేసీఆర్ ఏం చెప్పేవారు? మీరేం చేసేవారు?
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ఓఎస్డీ రాజశేఖర్‌రెడ్డిని విచారించిన సిట్
టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు వాంగ్మూలం ఆధారంగా ప్రశ్నలు
హైదరాబాద్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ఓఎస్డీ రాజశేఖర్‌రెడ్డిని సిట్ అధికారులు గురువారం విచారించారు. జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్‌లోని సిట్ ఆఫీసులో సుమారు రెండు గంటల పాటు వివిధ అంశాలపై ప్రశ్నించారు. ఈ కేసులో అరెస్టైన అప్పటి టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు, విచారణ ఎదుర్కొంటున్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావులను ప్రశ్నించినప్పుడు వెలుగుచూసిన అంశాల ఆధారంగా రాజశేఖర్‌రెడ్డిని విచారించినట్టు సమాచారం. రాధాకిషన్‌రావు తన వాంగ్మూలంలో మాజీ సీఎం కేసీఆర్ పేరును పలుమార్లు పేర్కొన్న విషయం తెలిసిందే. తనకు సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు అందేవని, ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు, ఆయన బృందం ఇచ్చే సూచనల మేరకు తాను బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వారిపై నిఘా పెట్టేవాడినని ఆయన వాంగ్మూలంలో వెల్లడించారు. ఈ క్రమంలో సిట్ అధికారులు రాజశేఖర్‌రెడ్డిని వివిధ అంశాలపై ప్రశ్నించారు. ‘‘ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు నియామకం నిబంధనల మేరకు జరిగిందా? మీ ద్వారానే ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన ఫోన్ నంబర్లు, లేదా వ్యక్తుల పేర్లు ఎస్‌ఐబీకి అందేవా? నాటి సీఎం కేసీఆర్‌తో అధికారులు నేరుగా మాట్లాడే అవకాశాలు తక్కువ కాబట్టి.. కేసీఆర్ ఆదేశాలను మీరే అధికారులకు చేరవేసేవారా? అధికారులు ఇచ్చిన సమాచారాన్ని కేసీఆర్‌కు మీరే అందించేవారా? నిబంధనల ప్రకారం సీఎం ఓఎస్డీగా ఉన్నవారు ఏవైనా ఆదేశాలుంటే ఆయా శాఖల ఉన్నతాధికారులకు చెప్పాల్సి ఉంటుంది. ఆ లెక్కన మీరు అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాలను నేరుగా నాటి డీజీపీ లేదా కమిషనర్‌కే చెప్పేవారా? లేక నేరుగా ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావుతో మాట్లాడేవారా?’’ అని సిట్ అధికారులు ఆరా తీసినట్టు సమాచారం. అయితే తాను కేవలం ఉద్యోగినేనని, నిబంధనల ప్రకారమే వ్యవహరించానని రాజశేఖరరెడ్డి బదులిచ్చినట్టు సమాచారం. ఇక ప్రభాకర్ రావు నియమాకానికి సంబంధించిన జీవో, నోట్ ఫైల్ కోసం అధికారులు ఆరా తీసినట్టు తెలిసింది.