Phone Tapping Case: ఫోన్ అక్రమ ట్యాపింగ్‌లో..రాజకీయ కోణంపై సిట్ దృష్టి
ABN , Publish Date - Dec 27 , 2025 | 04:30 AM
ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ కుట్ర కోణాన్ని వెలికితీసేందుకు కొత్త సిట్ బృందం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ప్రముఖ ఎన్నికల విశ్లేషకుడు....
2023 నవంబరు కంటే ముందు ట్యాపింగ్‌పై నజర్
సెఫాలజిస్ట్ ఆరా మస్తాన్ మళ్లీ విచారణ
త్వరలో బీఆర్‌ఎస్ నేతలకు పిలుపు
కవిత భర్త అనిల్‌కుమార్‌నూ విచారించే అవకాశం
ప్రభాకర్‌రావును వదిలేసినసిట్
హైదరాబాద్, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ కుట్ర కోణాన్ని వెలికితీసేందుకు కొత్త సిట్ బృందం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ప్రముఖ ఎన్నికల విశ్లేషకుడు (సెఫాలజిస్ట్) ఆరా మస్తాన్‌ను మరోసారి విచారించింది. గతంలో ఒకసారి మస్తాన్ వాంగ్మూలాన్ని సిట్ నమోదు చేసింది.శుక్రవారం మరోసారి ఆయనను విచారణకు పిలిచి రెండు గంటలపాటు ప్రశ్నించింది. ఫోన్ అక్రమ ట్యాపింగ్ 2023 నవంబరులోనే కాకుండా అంతకు ముందు నుంచే జరిగిందన్న విషయాన్ని నిర్ధారించుకోవడానికి సిట్ అధికారులు మస్తాన్‌ను విచారించారు. వాస్తవానికి ప్రస్తుత సిట్ వద్ద 2023 నవంబరు నెలలో జరిగిన ట్యాపింగ్ వివరాలు మాత్రమే సాక్ష్యాధారాలతో ఉన్నాయని సమాచారం. అంతకు చాలాకాలం ముందునుంచే ట్యాపింగ్ జరిగిందన్నదానిపై ఆధారాల కోసం గతంలో తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఆరోపించిన వారిని మరోసారి ప్రశ్నించాలని సిట్ భావిస్తోంది. అందులో భాగంగానే ఆరా మస్తాన్ గతంలో ఇచ్చిన వాంగ్మూలంపై మరోసారి ప్రశ్నించినట్లు సమాచారం. కాగా, గత రెండువారాలుగా సిట్ కస్టడీలో ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును శుక్రవారం తెల్లవారుజామున వైద్య పరీక్షల అనంతరం సిట్ అఽధికారులు వదిలిపెట్టారు. సిట్ కార్యాలయం నుంచి కుమారుడితో కలిసి ఆయన ఇంటికి వెళ్లిపోయారు.
పాత ప్రశ్నలే అడిగారు: ఆరా మస్తాన్
సిట్ అధికారులు గతంలో అడిగిన ప్రశ్నలనే మళ్లీ అడిగారని విచారణ అనంతరం ఆరా మస్తాన్ మీడియాకు తెలిపారు. 2020 నుంచి తన ఫోన్ ట్యాప్ చేస్తున్నట్లు అనుమానంగా ఉందన్న విషయాన్ని సిట్‌కు వెల్లడించినట్లు చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి, బీజేపీ నేత ఈటల రాజేందర్, కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో గతంలో తాను ఫోన్‌లో మాట్లాడిన మాటలను ప్రభాకర్‌రావు బృందం అక్రమంగా రికార్డు చేసిందని సిట్ అధికారులకు ఆరా మస్తాన్ మరోసారి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. సాక్ష్యాధారాలను ప్రభాకర్‌రావు బృందం నాశనం చేయడంతో అప్పట్లో ఆరోపణలు చేసిన వారందర్నీ మళ్లీ విచారించాలని సిట్ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. తన భర్త అనిల్‌కుమార్ ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఇటీవల ఆరోపించిన నేపథ్యంలో ఆయనను కూడా సిట్ విచారణకు పిలిచే అవకాశాలు కన్పిస్తున్నాయి. బీఆర్‌ఎస్ పార్టీలో ఉన్న కొందరు ముఖ్య నేతల ఫోన్లను కూడా ప్రభాకర్‌రావు బృందం ట్యాప్ చేసిందని గుర్తించిన సిట్ అధికారులు.. వారిని వాంగ్మూలాలు కూడా నమోదు చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
ప్రభాకర్‌రావు పదవీకాలం పొడిగింపుపైనా దృష్టి..
ప్రభాకర్‌రావు ఎస్‌ఐబీ చీఫ్‌గా రిటైర్ అయినప్పటికీ ఆయనను ఓఎ్‌సడీ పోస్టులో నియమించడానికి సంబంధించిన నోట్‌ఫైల్ తయారీ నుంచి అప్రూవల్ వరకు జరిగిన కరస్పాండెన్స్‌ను సిట్ అధికారులు సేకరించారు. మాజీ అధికారికి అత్యంత ముఖ్యమైన ఇంటెలిజెన్స్ బాధ్యతలను ఎందుకు అప్పగించారు? ఇలా చేయమని మీకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు? ఇది తప్పు అన్న విషయాన్ని నాటి ప్రభుత్వ పెద్దలకు చెప్పలేదా? అనే విషయాలను ఈ ఉత్తర్వులపై ప్రపోజల్ నుంచి ఆర్డర్ వరకు సంతకాలు పెట్టిన నాటి డీజీపీ, హోంశాఖ కార్యదర్శిని సిట్ అధికారులు ప్రశ్నించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రశ్నలు సిద్ధమయ్యాయని.. ఒకటి రెండు రోజుల్లో వారిని సిట్ ప్రశ్నించవచ్చని తెలిసింది. ఇప్పటివరకు విచారణలో ప్రభాకర్‌రావు వెల్లడించిన అంశాల ఆధారంగా నాటి ప్రభుత్వ పెద్దలకు నోటీసులు ఇవ్వడంతోపాటు సీఎంవోలో కీలకపాత్ర పోషించిన కొంతమంది అధికారులను సిట్ అధికారులు ప్రశ్నించవచ్చని సమాచారం.