Share News

Sirisilla Collector: సిరిసిల్ల కలెక్టర్‌ సందీప్‌ ఝాపై వేటు

ABN , Publish Date - Sep 28 , 2025 | 01:34 AM

సిరిసిల్ల కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝాపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. మరో నలుగురు ఐఏఎస్‌ అధికారులను కూడా బదిలీ చేసింది...

Sirisilla Collector: సిరిసిల్ల కలెక్టర్‌ సందీప్‌ ఝాపై వేటు

  • రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పోస్టింగ్‌

  • మరో నలుగురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ

హైదరాబాద్‌, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): సిరిసిల్ల కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝాపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. మరో నలుగురు ఐఏఎస్‌ అధికారులను కూడా బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్‌ రామకృష్ణారావు శనివారం బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 17న సిరిసిల్లలో నిర్వహించిన ప్రజా పాలనా దినోత్సవానికి శాసన సభ విప్‌ ఆది శ్రీనివాస్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ సందీప్‌ ఝా ముందస్తుగా హాజరు కావాల్సి ఉండగా.. ఆలస్యంగా వచ్చారు. దీనిపై ఆది శ్రీనివాస్‌ సీఎంవోలో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. ఆ మేరకు సీఎస్‌ కూడా కలెక్టర్‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. తాజాగా ఆయన్ను సిరిసిల్ల నుంచి బదిలీ చేసి.. రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పోస్టింగ్‌ ఇచ్చారు. ఇది అప్రాధాన్య పోస్టు అన్న అభిప్రాయాలున్నాయి. కాగా, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీకి సాధారణ పరిపాలనా శాఖ(జీఏడీ) ముఖ్యకార్యదర్శి(పొలిటికల్‌)గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు జీఏడీ బాధ్యతలు చూసిన వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావును రెండు పోస్టుల నుంచి బదిలీ చేసి వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా పోస్టింగ్‌ ఇచ్చారు. రవాణా శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. రవాణా శాఖ కమిషనర్‌ సురేంద్ర మోహన్‌ను బదిలీ చేసి, వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శిగా నియమించారు. సహకార సొసైటీల రిజిస్ట్రార్‌గా, మార్కెటింగ్‌ డైరెక్టర్‌గా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. విద్యా శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎం.హరితకు సిరిసిల్ల కలెక్టర్‌గా పోస్టింగ్‌ ఇచ్చారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా ఉన్న కె.హరితకు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పోస్టింగ్‌ ఇచ్చారు.

Updated Date - Sep 28 , 2025 | 01:34 AM