Telangana Faces Intensifying Cold Spell: రాబోయే పది రోజులు గజగజే!
ABN , Publish Date - Nov 10 , 2025 | 03:35 AM
తెలంగాణలో చలిపులి ఇప్పటికే మొదలైంది. రాత్రి ఉష్ణోగ్రతలు రోజురోజుకి పడిపోతున్నాయి. మూడు నాలుగు రోజుల వ్యవధిలోనే కనిష్ఠ ఉష్ణోగ్రతలు....
రాష్ట్రంలో మరింత పెరగనున్న చలి తీవ్రత
11-19 తేదీల్లో పలు జిల్లాల్లో 10 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు
రాష్ట్ర ప్రణాళిక అభివృద్ధి సంఘం హెచ్చరిక
హైదరాబాద్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో చలిపులి ఇప్పటికే మొదలైంది. రాత్రి ఉష్ణోగ్రతలు రోజురోజుకి పడిపోతున్నాయి. మూడు నాలుగు రోజుల వ్యవధిలోనే కనిష్ఠ ఉష్ణోగ్రతలు 18-20 డిగ్రీల నుంచి 9-13 డిగ్రీల మధ్యకు చేరుకున్నాయి. అయితే, రాబోయే పది రోజుల్లో చలి తీవ్రత మరింత పెరగబోతుంది. అవును.. నవంబరు 11-19 తేదీల వరకు అనగా రాబోయే పది రోజుల్లో రాష్ట్రంలో చలి తీవ్రత అధికంగా ఉండనుందని తెలంగాణ ప్రణాళిక అభివృద్ధి సంఘం ఆదివారం హెచ్చరించింది. ముఖ్యంగా 13-17 తేదీల మధ్య మరింత అధికంగా ఉంటుందని, కొన్ని జిల్లాల్లో రాత్రి పూట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ అంటే పది డిగ్రీల లోపునకు పడిపోనున్నాయని పేర్కొంది. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో 10 డిగ్రీలోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హెచ్చరించింది. సోమవారం నుంచి బుధవారం వరకు యెల్లో అలెర్ట్ జారీ చేసింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 9-15 డిగ్రీల మధ్య నమోదవుతాయని పేర్కొంది. ముఖ్యంగా ఆసిఫాబాద్, భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు 9-10 డిగ్రీల మధ్య నమోదవుతాయని వెల్లడించింది. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఇక, మిగిలిన జిల్లాల్లో 11-15డిగ్రీల మధ్య నమోదు అవుతాయని వెల్లడించింది. అలాగే, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 26-30డిగ్రీల మధ్య నమోదవుతాయని పేర్కొంది. కాగా, శనివారంరాత్రి ఆదిలాబాద్ జిల్లా అర్లీ(టీ)లో 14.7డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
మరో తుపాను ముప్పు!
విశాఖపట్నం: పసిఫిక్ మహాసముద్రం నుంచి వచ్చే తేమగాలుల ప్రభావంతో ఈ నెల 19 లేదా 20న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. తర్వాత పశ్చిమంగా పయనించే క్రమంలో ఇది బలపడి తుపానుగా మారుతుందని ఇస్రో వాతావరణ నిపుణుడు వెల్లడించారు. అనంతరం ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా దిశగా రానుందని అంచనావేశారు. దక్షిణ కోస్తా జిల్లాలపై దీని ప్రభావం ఉంటుందని విశ్లేషించారు. దీని కంటే ముందుగానే శ్రీలంక సమీపంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నాయి.