Diwali Bonus For Singareni workers: నేడు సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్
ABN , Publish Date - Oct 18 , 2025 | 04:50 AM
సింగరేణి కార్మికులకు ఆ సంస్థ దీపావళి బోనస్ ప్రకటించింది. పనితీరు ఆధారిత రివార్డు (పీఎల్‌ఆర్) పథకం కింద అర్హత కలిగిన కార్మికులకు..
ఒక్కో కార్మికుడి ఖాతాలో రూ.1.03 లక్షలు జమ
హైదరాబాద్, కొత్తగూడెం, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): సింగరేణి కార్మికులకు ఆ సంస్థ దీపావళి బోనస్ ప్రకటించింది. పనితీరు ఆధారిత రివార్డు (పీఎల్‌ఆర్) పథకం కింద అర్హత కలిగిన కార్మికులకు రూ.1.03 లక్షల చొప్పున బోనస్ చెల్లించేందుకు సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఆదేశాలతో శనివారం కార్మికుల ఖాతాల్లో ఆ మొత్తాన్ని జమ చేయనున్నట్లు సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ తెలిపారు. క 2024-25 సంవత్సరానికి సంబంధించి ఉపరితల గనుల్లో కనీసం 240 రోజులు, భూగర్భ గనుల్లో 190 రోజులు పనిచేసిన కార్మికులకు రూ. 1.03 లక్షల బోన్‌సను అందించనున్నారు. అంతకంటే తక్కువ పనిదినాలు పూర్తిచేసిన వారికి నిష్పత్తి ప్రకారం బోన్‌సను చెల్లిస్తారు. అందుకోసం సింగరేణిలో పనిచేస్తున్న సుమారు 39,500 మంది కార్మికులకు గాను రూ.400 కోట్లను సంస్థ కేటాయించింది. కనీసం 30 మస్టర్లు పూర్తి చేసిన కార్మికులను బోనస్ పొందడానికి అర్హులుగా పరిగణిస్తుండగా.. హింసాత్మక ప్రవర్తన, కంపెనీ ఆస్తిని ధ్వంసం చేయడం వంటి కారణాలతో సర్వీస్ నుంచి తొలగించిన ఉద్యోగులు అనర్హులని ఉత్తర్వుల్లో పేర్కొంది. సింగరేణి కార్మికులకు దీపావళి బోన్‌సను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం, డీప్యూటీ సీఎంకు కార్మికుల పక్షాన సింగరేణి సీఎండీ కృతజ్ఞతలు తెలిపారు.