Nehru Aluminium Centre for rare minerals research: నెహ్రూ అల్యూమినియంతో సింగరేణి జట్టు
ABN , Publish Date - Nov 04 , 2025 | 02:30 AM
వ్యాపార విస్తరణలో భాగంగా నాగ్‌పూర్ కేంద్రంగా పనిచేస్తున్న కేంద్ర గనుల శాఖ అనుబంధ స్వతంత్ర పరిశోధన సంస్థ జవహర్‌లాల్ నెహ్రూ అల్యూమినియం....
అరుదైన ఖనిజాల కోసం కుదిరిన ఒప్పందం
హైదరాబాద్, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): వ్యాపార విస్తరణలో భాగంగా నాగ్‌పూర్ కేంద్రంగా పనిచేస్తున్న కేంద్ర గనుల శాఖ అనుబంధ స్వతంత్ర పరిశోధన సంస్థ జవహర్‌లాల్ నెహ్రూ అల్యూమినియం రీసెర్చ్ డెవల్‌పమెంట్ అండ్ డిజైన్ సెంటర్‌తో సింగరేణి చేతులు కలిపింది. కీలక ఖనిజాలు, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ (అరుదైన భూ మూలకాలు) ఉనికి, విస్తరణ తదితర అంశాలను శాస్ర్తీయంగా విశ్లేషించి సమాచారం అందించేందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కలిసి పనిచేయడానికి ఒప్పందం కుదిరింది. సోమవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ సమక్షంలో జరిగిన కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్ (పీ అండ్ పీ) కె.వెంకటేశ్వర్లు, పరిశోధనా సంస్థ డైరెక్టర్ అనుపమ్ అగ్నిహోత్రి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. సింగరేణి పెద్ద ఎత్తున దేశ, విదేశాల్లో వ్యాపార విస్తరణ చేపట్టాలని నిర్ణయించినందున కీలక ఖనిజాలు, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్టు బలరామ్ తెలిపారు. దేశ, విదేశాల్లో సింగరేణి.. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ రంగంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పరిశోధనలకు ఈ పరిశోధన సంస్థ సహకారం తీసుకుంటామన్నారు. సింగరేణి ప్రాంతంలో ఓపెన్ కాస్ట్ గనుల్లో లభ్యమయ్యే ఓవర్ బర్డెన్ (ఓబీ)లో, థర్మల్ కేంద్రంలోని ఫ్లైయా్‌షలో, సింగరేణి సమీప ప్రాంత గుట్టల్లో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉనికి ప్రాథమికంగా నిర్ధారితమైందని, దీనిపై లోతైన పరిశీలనకు ఈ సంస్థ సహకారం తీసుకుంటామని తెలిపారు.