8 Metro Corridors in Hyderabad: 8 కారిడార్లు ఒకేసారి!
ABN , Publish Date - Oct 06 , 2025 | 04:08 AM
హైదరాబాద్ నగరంలో మెట్రోరైలు రెండో దశ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని క్షేత్రస్థాయిలో....
ఏకకాలంలో నిర్మాణ పనులు ప్రారంభం!
వేర్వేరుగా టెండర్లు.. సర్కారు యోచన
వేగంగా 2వ దశ మెట్రో విస్తరణ..
డీపీఆర్‌కు కేంద్రం నుంచి అనుమతి రాగానే అన్ని పనులు షురూ
వచ్చే ఎన్నికల నాటికి చిన్న కారిడార్లను పూర్తిచేసే ప్రయత్నం
కియోలి్‌సతోనే రైళ్ల రాకపోకలు
తగ్గనున్న మెట్రో డిపోలు
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగరంలో మెట్రోరైలు రెండో దశ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని క్షేత్రస్థాయిలో ఉండే అడ్డంకులను వడివడిగా తొలగించుకుని ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తోంది. ఎల్‌అండ్‌టీ నుంచి మొదటి దశలోని మూడు కారిడార్ల నిర్వహణ బాధ్యతలను పూర్తిగా తీసుకునేందుకు ఆ సంస్థతో ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో రెండో దశ పనులపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు మొత్తం 8 కారిడార్లకు సంబంధించిన నిర్మాణాన్ని ఒకేసారి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఎనిమిది కారిడార్లకు సంబంధించి మొత్తం 162.9 కిలోమీటర్ల పనులకుగాను రూ.43,847.22 కోట్లు కేటాయించింది. ప్రాజెక్టులో 48 శాతం వాటా కింద అంతర్జాతీయ బ్యాంకుల నుంచి 2-4 శాతం వడ్డీతో రుణాలు సేకరించనుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం సావరీన్ గ్యారంటీ ఇవ్వడంతోపాటు తన వంతు వాటాగా 18 శాతం నిధులు సమకూర్చనుంది. ఇక ఎల్‌అండ్‌టీ నుంచి మొదటిదశ కారిడార్లను టేకోవర్ చేసుకున్న నేపథ్యంలో రెండో దశలో ప్రతిపాదించిన అన్ని కారిడార్లకు సంబంధించిన డీపీఆర్‌లకు కేంద్రం నుంచి అనుమతి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలోని వివిధ శాఖల మంత్రులను పలు దఫాలుగా కలిసి రెండో దశ విస్తరణ ప్రాధాన్యాన్ని వివరించారు.
8 కారిడార్లకు వేర్వేరుగా టెండర్లు..
ఎల్‌అండ్‌టీతో తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని, నెట్ వర్కింగ్, టికెట్ ధరలన్నీ ఒకే గొడుగు కింద ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ మేరకు ఎల్‌అండ్‌టీతో కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలను కేంద్రానికి త్వరగా అందజేసేందుకు చర్యలు తీసుకుంటోంది. కేంద్రం నుంచి డీపీఆర్‌లకు గ్రీన్‌సిగ్నల్ లభించిన వెంటనే 8 కారిడార్లకు వేర్వేరుగా టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఒకే టెండర్ కింద అన్నింటినీ నిర్వహిస్తే పనులన్నీ ఆలస్యమవుతాయని భావిస్తోంది. దీంతో ఒక్కో సంస్థకు ఒక్కో కారిడార్‌ను అప్పగించి పూర్తి చేయించాలని చూస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తక్కువ దూరం కలిగిన ఎల్‌బీనగర్-హయత్‌నగర్ (7.1 కిలోమీటర్లు), ఎంజీబీఎ్‌స-చాంద్రాయణగుట్ట (7.5 కిలోమీటర్లు), రాయదుర్గం-కోకాపేట్ నియోపోలీస్ (11.6 కిలోమీటర్లు) పనులను పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రెండో దశలోని పార్ట్-ఏలో ప్రతిపాదించిన ఓల్డ్‌సిటీ కారిడార్‌కు ఆస్తుల సేకరణ ఇప్పటివరకు 65 శాతం పూర్తయింది. ఈ నెలాఖరులోగా మిగతా ఆస్తులను సేకరించి టెండర్ పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తగ్గనున్న మెట్రో డిపోలు..
మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ద్వారా పలు ప్రయోజనాలు ఉన్నాయని మెట్రో అధికారులు పేర్కొంటున్నారు. మొదటి దశ కోసం సుమారు 90 ఎకరాల్లో ఉప్పల్, మియాపూర్ మెట్రో డిపోలను నిర్మించారు. అయితే రెండో దశలో నిర్మించనున్న 5 మార్గాల (ఎల్‌బీనగర్-హయత్‌నగర్, మియాపూర్-పటాన్‌చెరు, రాయదుర్గం-కోకాపేట నియోపోలీస్, నాగోల్-శంషాబాబాద్ ఎయిర్‌పోర్టు, ఎంజీబీఎ్‌స-చాంద్రాయణగుట్ట)కు పాత డిపోలనే వినియోగించే అవకాశం ఉంది. మిగిలిన శంషాబాద్ ఎయిర్‌పోర్టు-భారత్ ప్యూచర్ సిటీ, ప్యారడైజ్- మేడ్చల్, ప్యాట్నీ-శామీర్‌పేట మెట్రో మార్గాలకు కొత్తగా రెండు మెట్రో డిపోలను నిర్మిస్తే సరిపోతుందని మెట్రో అధికారులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవంగా మెట్రో డిపోల ఏర్పాటు కోసం సుమారు 100 ఎకరాల భూమి, నిర్మాణాల కోసం రూ.వందల కోట్ల నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. అయితే మొదటి దశలో ఇప్పటికే నిర్మించిన 2 డిపోల్లో మరిన్ని మెట్రో రైళ్లను పార్కింగ్ చేసుకొని, నిర్వహణ పనులు చేసుకునే అవకాశం ఉండడంతో డిపోల సంఖ్య తగ్గుతోందని అధికారులు పేర్కొంటున్నారు.
కియోలిస్ ఆధ్వర్యంలోనే రైళ్ల ఆపరేషన్స్..!
ఫ్రాన్స్‌కు చెందిన కియోలిస్ గ్రూపు అనుబంధ సంస్థగా ఉన్న కియోలిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా మెట్రో రైళ్ల ఆపరే షన్స్, మెయింటెనెన్స్ సేవలు అందిస్తోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ ప్రాజెక్టు నిర్మించిన ఎల్‌అండ్‌టీతో జత కట్టి 8 ఏళ్లుగా మెట్రో రైళ్లను నిర్వహిస్తోంది. తాజాగా మహారాష్ట్రలోని పుణె నగరంలో ఉన్న మెట్రోలైన్-3ని నిర్వహించే కాంట్రాక్టును పొందింది. మెట్రో రైళ్ల నిర్వహణలో గ్లోబల్ లీడర్‌గా ఉన్న కియోలిస్ గ్రూపు హైదరాబాద్, పుణెతోపాటు లండన్, దోహా, దుబాయ్, షాంఘై, పారి్‌సలోనూ మెట్రో రైళ్ల సేవలను ప్రయాణికులకు అందిస్తోంది. మెట్రో రైళ్ల ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయిన తర్వాత చేపట్టే ఆపరేషన్స్, మెయిన్‌టెన్స్‌కు సంబంధించిన కార్యకలాపాల్లో కియోలిస్ అగ్రగామి సంస్థగా ఉంది. అయితే ఎల్‌అండ్‌టీతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా కియోలిస్ 2026 వరకు పనిచేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మొదటిదశ మెట్రోను పూర్తిగా తీసుకుంటున్న తరుణంలో ఆపరేషన్స్ నిర్వహణ బాధ్యతలను కూడా కియోలి్‌సకే అప్పగించనుంది.