Significant Rise in Groundwater: జూలైలో భూగర్భ జలాల్లో గణనీయ వృద్ధి నమోదు
ABN , Publish Date - Aug 11 , 2025 | 03:40 AM
రాష్ట్రంలో భూగర్భ జలమట్టాల్లో గణనీయమైన వృద్ధి నమోదైంది. వాటి సగటు లోతు మేలో
వర్షాలతో 8.37 మీటర్లకు పెరుగుదల
12 జిల్లాల్లో పరిస్థితి ఇంకా ఆందోళనకరమే
హైదరాబాద్, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భూగర్భ జలమట్టాల్లో గణనీయమైన వృద్ధి నమోదైంది. వాటి సగటు లోతు మేలో 10.07 మీటర్లకు పడిపోగా, వర్షాలతో జూన్‌లో 9.47 మీటర్లకు, జూలైలో 8.37 మీటర్లకు పెరిగింది. మేతో పోలిస్తే సగటున జూన్‌లో 0.6 మీటర్లు, జూలైలో 1.69 మీటర్ల మేర పెరిగింది. అయితే, గత ఏడాది జూలైతో పోలిస్తే ఈ ఏడాది జూలైలో మాత్రం 0.13 మీటర్ల మేర తక్కువగానే ఉంది. రాష్ట్ర భూగర్భ జల వనరుల శాఖ జూన్‌లో రాష్ట్రవ్యాప్తంగా పరిశీలించి రూపొందించిన నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు విస్తారంగా కురిశాయి. దీంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. గోదావరి పరీవాహకంలో మాత్రం వర్షాభావ పరిస్థితులతో కొన్ని జిల్లాల్లో భూగర్భ జలాలు జూన్‌తో పోలిస్తే జూలైలో తగ్గిపోయాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా మెదక్ జిల్లాలో 14.16 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. అత్యల్పంగా ఖమ్మం జిల్లాలో 3.87 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయి. 2024 జూలైతో పోలిస్తే 2025 జూన్‌లో 15 జిల్లాల్లో భూగర్భ జలాల్లో వృద్ధి నమోదైంది. మరో 18 జిల్లాల్లో క్షీణత కనిపించింది.