Sigachi MD Amitraj Sinha Arrested: సిగాచీ ఎండీ అమిత్‌రాజ్ సిన్హా అరెస్ట్
ABN , Publish Date - Dec 29 , 2025 | 02:06 AM
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచీ పరిశ్రమ ఎండీ, సీఈవో అమిత్‌రాజ్ సిన్హాను పోలీసులు అరెస్ట్ చేశారు.
పటాన్‌చెరురూరల్, డిసెంబర్ 28 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచీ పరిశ్రమ ఎండీ, సీఈవో అమిత్‌రాజ్ సిన్హాను పోలీసులు అరెస్ట్ చేశారు. పరిశ్రమలో ఈ ఏడాది జూన్ 30న జరిగిన ఘోర ప్రమాదంలో 54 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సంగారెడ్డి జిల్లా బీడీఎల్, భానూరు పోలీస్ స్టేషన్లలో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అయినా పరిశ్రమ యాజమాన్యాన్ని అరెస్టు చేయకపోవడంతో ప్రజాసంఘాలు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టాయి. కేసు దర్యాప్తులో జరుగుతున్న జాప్యంపై హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో ఎట్టకేలకు దర్యాప్తులో భాగంగా పరిశ్రమ ఎండీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యాయస్థానం నిందితుడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండుకు ఆదేశించింది. దర్యాప్తు కొనసాగుతోందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు.