Siddipet Student: కండక్టర్ లేకున్నా ఉచిత ప్రయాణం
ABN , Publish Date - Nov 23 , 2025 | 06:11 AM
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం మరింత పకడ్బందీగా అమలు చేసేందుకుగాను...
స్కానర్‌పై ఆధార్ కార్డు పెడితే టికెట్ జారీ
సిద్దిపేట జిల్లా కొండపాక విద్యార్థిని ఆవిష్కరణ
కొండపాక, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం మరింత పకడ్బందీగా అమలు చేసేందుకుగాను సిద్దిపేట జిల్లా విద్యార్థిని కీర్తన, ఉపాధ్యాయుడు రామస్వామి మార్గదర్శకత్వంలో వినూత్న పరికరాన్ని రూపొందించింది. ఆమె కొండపాక జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో చదువుతోంది. మూడు రోజుల క్రితం సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్‌లో కీర్తన రూపొందించిన పరికరం అందరినీ ఆకట్టుకుంది. ఆమె ఈ ప్రదర్శన రాష్ట్రస్థాయికి ఎంపికైంది.
ఏమిటా పరికరం.. ఎలా పనిచేస్తుంది?
బస్ కండక్టర్ లేకుండా కేవలం ఆధార్ కార్డుతో మహిళలు ఉచిత ప్రయాణించే ప్రత్యేక పరికరాన్ని కీర్తన రూపొందించింది. బస్సులో ప్రయాణించే మహిళలు తమ ఆధార్ కార్డును స్కానర్‌పై ఉంచితే, డిస్‌ప్లేలో బస్సు ప్రయాణించే మార్గంలోని స్టేజ్‌ల పేర్లు నంబర్లతో సహా కనిపిస్తాయి. ప్రయాణికురాలు తాను ప్రయాణించదల్చుకున్న నంబరును ఎంటర్ చేస్తే, ఉచిత టికెట్ తాలూకు ప్రింట్ టికెట్ రూపంలో బయటకు వస్తుంది. ఒకసారి టికెట్ తీసుకున్నాక మూడు గంటల వరకు అదే ఆధార్‌కార్డుపై మరో బస్సులో టికెట్ రాకుండా నిరోధించే వ్యవస్థ కూడా ఈ పరికరంలో ఉందని విద్యార్థిని కీర్తన చెబుతోంది. కండక్టర్ లేని వన్‌మ్యాన్ సర్వీసు బస్సుల్లో డ్రైవర్లు ఇబ్బంది పడకుండా, టికెట్ల జారీలో జాప్యం నిరోధించేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుందని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.