Siddipet MLA Harish Rao: తన ఇల్లు తనఖా పెట్టి మరీ..
ABN , Publish Date - Dec 20 , 2025 | 04:48 AM
పీజీ మెడికల్ ప్రవేశ పరీక్షలో సత్తా చాటి కన్వీనర్ కోటాలో సీటు సాధించిన ఓ పేదింటి యువతి చదువు కొనసాగేందుకు బీఆర్‌ఎస్...
ఓ విద్యార్థిని వైద్యవిద్యకు20లక్షల విద్యా రుణం ఇప్పించిన హరీశ్‌రావు
హాస్టల్ ఫీజు కోసం మరో లక్ష ఆర్థికసాయం
సిద్దిపేట కల్చరల్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): పీజీ మెడికల్ ప్రవేశ పరీక్షలో సత్తా చాటి కన్వీనర్ కోటాలో సీటు సాధించిన ఓ పేదింటి యువతి చదువు కొనసాగేందుకు బీఆర్‌ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అండగా నిలిచారు. ఫీజులు చెల్లించేందుకు ఆర్థిక స్తోమత లేక సీటు వదులుకునే పరిస్థితిలో ఉన్న ఆ యువతి సాయం అడిగిన వెంటనే స్పందించారు. తన ఇంటిని తాకట్టు పెట్టి మరీ రూ.20 లక్షల విద్యా రుణం ఇప్పించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. అంతేకాక, హాస్టల్ ఫీజుల నిమిత్తం ఆ యువతికి మరో రూ.లక్ష ఇచ్చి నేనున్నా అంటూ భరోసా ఇచ్చారు. వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేటకు చెందిన కొంక రామచంద్రం, శారద దంపతులకు నలుగురు కుమార్తెలు. నలుగురు వైద్య విద్య అభ్యసిస్తున్నారు. రామచంద్రం పెద్ద కు మార్తె మమత 2018లో నీట్‌లో 512 ర్యాంకు సాధిం చి విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో సీటు పొందారు. మార్చిలో ఆమె ఎంబీబీఎస్ పూర్తయింది. రెండో కుమార్తె మాధురికి 2020లో నీట్‌లో సీటు రాగా కరీంనగర్ చల్మెడ ఆనందరావు కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనలియర్ చదువుతున్నారు. కవలలైన రోహిణి, రోషిణి 2024లో నీట్‌లో సత్తా చాటి ప్రస్తు తం జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్నారు. రోహిణి, రోషిణి ఎంబీబీఎస్‌లో చేరే సమయంలో హరీశ్ వారికి అవసరమైన రూ.50వేలు ఆర్థిక సాయం చేశారు. ఈ క్రమంలో పీజీ ఎంట్రన్స్ రాసిన మమతకు మహబూబ్‌నగర్‌లోని ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో ఆప్తమాలజీ (కంటి వైద్యం) విభాగంలో కన్వీనర్ కోటాలో సీటు వచ్చింది. అయితే, మూడేళ్ల పాటు ఏటా రూ.7.50 లక్షల చొప్పున ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంది. ఇందుకుగాను విద్యా రుణం కోసం మమత, ఆమె తండ్రి బ్యాంకులను సంప్రదించగా ఏమైనా ఆస్తులు తనఖా పెడితేనే రుణం ఇస్తామని అధికారులు స్పష్టం చేశారు. దీంతో రామచంద్రం.. హరీశ్ రావు దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన హరీశ్.. సిద్దిపేటలోని తన ఇంటిని ఓ బ్యాంకులో తనఖా పెట్టి దాదాపు రూ.20లక్షల విద్యా రుణాన్ని మమతకు మంజూరు చేయించారు. అలాగే, మొదటి సంవత్సరం హాస్టల్ ఫీజుల కోసం మరో రూ.లక్ష అవసరమని మమత చెప్పగా.. ఆ మొత్తాన్ని కూడా హరీశ్ ఆమెకు స్వయంగా ఇచ్చారు. దీంతో తన కుమార్తెల చదువుకు అండగా నిలిచిన హరీశ్ రావు రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనంటూ రామచంద్రం పేర్కొన్నారు.
పీజీ సీటు పోతుందని భయపడ్డా
అమ్మానాన్నలు టైలరింగ్ చేస్తూ నన్ను ఎంబీబీఎస్ దాకా చదివించారు. పీజీ సీటు వచ్చినా రూ.22.50 లక్షల ఫీజు కట్టడం మావల్ల కాదని తెలిసి సీటు పోతుందేమోనని భయపడ్డాను. గతంలో మా చెల్లెళ్లకు హరీశ్‌రావు సర్ సహాయం చేశారు. ఇప్పుడు ఇంత పెద్ద మొత్తం అంటే చేస్తారో లేదో అని సందేహించాం. కానీ అడగడమే ఆలస్యం.. తన ఇంటిని తనఖా పెట్టి మరీ విద్యారుణం ఇప్పించారు.
- మమత విద్యార్థిని
ఆర్థిక కారణాలతో చదువు ఆగవద్దు
ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎవరూ చదువును మధ్యలో ఆపవద్దు. నియోజకవర్గంలో ఎవరైనా మెడిసిన్‌లో మంచి ర్యాంకు సాధించి ఫీజులు కట్టలేని స్థితిలో ఉంటే నన్ను ఎప్పుడైనా కలవొచ్చు. ఫీజులు ఏర్పాటు చేసి చదివించే బాధ్యత నాది. నా పిల్లల కోసం ఎలా ఆలోచిస్తానో, నియోజకవర్గ పిల్లల గురించి కూడా అలాగే ఆలోచిస్తాను
-హరీశ్‌రావు, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే
ఉపాధి హామీ పథకంపై రాజకీయం తగదు
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం తగదని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కేంద్రం ప్రతిపాదించిన జీరామ్‌జీ బిల్లు దేశ సమాఖ్య స్ఫూర్తిపై జరుగుతున్న ప్రత్యక్ష దాడి అని శుక్రవారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. పథకం అమలులో కేంద్రం, రాష్ట్రాల నిధుల వాటాను ఉద్దేశపూర్వకంగా తెరపైకి తెచ్చిన కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరచాలని చూస్తోందని విమర్శించారు. ఉపాధి హామీ చట్టాన్ని దాని మౌలిక స్వరూపం దెబ్బతినకుండా కాపాడాలని, గాంధీ పేరును కొనసాగిస్తూ రాష్ట్రాల హక్కులను గౌరవించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.