Deputy Collector Appointment: చక్కని ర్యాంకులతో డిప్యూటీ కలెక్టర్లుగా
ABN , Publish Date - Sep 30 , 2025 | 04:17 AM
గ్రూప్ 1లో రాష్ట్ర స్థాయిలో ఐదో ర్యాంకు సాధించిన మహేశ్వరం నియోజకవర్గం మీర్‌పేట్ కార్పొరేషన్‌లోని జిల్లెలగూడకు చెందిన సిద్దాల కృతిక డిప్యూటీ కలెక్టర్‌గా నియామక పత్రం అందుకున్నారు...
సిద్దాల కృతికకు ఐదో ర్యాంకు.. యాదాద్రిలో రిపోర్టు
అనూషారెడ్డికి ఏడో ర్యాంకు.. సూర్యాపేటలో కొలువు
హైదరాబాద్ రూరల్ సీటీవోగా కల్యాణ్ గౌడ్
సరూర్‌నగర్, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): గ్రూప్-1లో రాష్ట్ర స్థాయిలో ఐదో ర్యాంకు సాధించిన మహేశ్వరం నియోజకవర్గం మీర్‌పేట్ కార్పొరేషన్‌లోని జిల్లెలగూడకు చెందిన సిద్దాల కృతిక డిప్యూటీ కలెక్టర్‌గా నియామక పత్రం అందుకున్నారు. ఆమెను యాదాద్రి భువనగిరి జిల్లాకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి సరూర్‌నగర్ మండల పరిషత్ మాజీ అధ్యక్షురాలు, మీర్‌పేట్ మాజీ కార్పొరేటర్ సిద్దాల లావణ్య బీరప్ప కుమార్తె కృతిక ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా సొంతంగా ఇంట్లోనే పట్టుదలతో చదివి గ్రూప్-1లో ఐదో ర్యాంకు సంపాదించారు. గత ఏడాది గ్రూప్-4లో 511వ ర్యాంకు సాధించి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సంపాదించారు. కాగా సోమవారం ఆమె తాను ప్రస్తుతం చేస్తున్న జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం నుంచి రిలీవ్ అయి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌రేట్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా రిపోర్ట్ చేశారు. ఉమ్మడి సరూర్‌నగర్ మండల రెవెన్యూ కార్యాలయంలో, అనంతరం బాలాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్వోగా, ఆ తర్వాత బడంగ్‌పేట్ మునిసిపల్ కార్పొరేషన్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించిన ఎల్బీనగర్‌కు చెందిన కె.అనూషారెడ్డి గ్రూప్-1 పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంకు సాధించారు. శనివారం ఆమెకు నియామక పత్రం అందజేసిన అధికారులు.. ఆమెను సూర్యాపేట జిల్లాకు కేటాయించారు. ఈ క్రమంలో సోమవారం ఆమె బడంగ్‌పేట్‌లో సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగం నుంచి రిలీవ్ అయి సూర్యాపేట్‌కు వెళ్లి జాయినింగ్ రిపోర్ట్ అందజేశారు. బడంగ్‌పేట్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా ఉన్న అనుషారెడ్డితో పాటు జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ముద్దగోని కల్యాణ్‌గౌడ్ గ్రూప్-1లో పరీక్షల్లో 173వ ర్యాంకు సాధించారు. బాలాపూర్ మండలంలోని నాదర్‌గుల్‌కు చెందిన కల్యాణ్.. గ్రూప్-4 ద్వారా జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరి, పట్టువదలకుండా గ్రూప్-1 పరీక్షల రాసి ఉత్తమ ర్యాంకు సొంతం చేసుకున్నారు. ఆయన తాజా నియామకాల్లో హైదరాబాద్ రూరల్ సీటీవో (కమర్షియల్ టాక్స్ ఆఫీసర్)గా ఎంపికయ్యారు. ఆయన కూడా సోమవారం బడంగ్‌పేట్ నుంచి రిలీవ్ అయి సీటీవో కార్యాలయంలో రిపోర్ట్ చేశారు. కాగా తమ మునిసిపల్ కార్యాలయం నుంచి ఇద్దరు ఉద్యోగులు మంచి ర్యాంకులతో ఉన్నత ఉద్యోగాలు సంపాదించినందుకుగాను సోమవారం మునిసిపల్ కమిషనర్ పి.సరస్వతి ఆధ్వర్యంలో అనుషారెడ్డి, కల్యాణ్‌గౌడ్‌లను ఘనంగా సన్మానించారు.