Share News

Financial Fraud: రూ.3 వేల కోట్ల ఆర్థిక మోసం కేసు నిందితుణ్ని..రూ.2 కోట్లు తీసుకుని వదిలేసిన ఎస్‌ఐ

ABN , Publish Date - Oct 28 , 2025 | 04:33 AM

సుమారు రూ.3 వేల కోట్ల విలువైన ఆర్థిక మోసం కేసులో నిందితుణ్ని.. రూ.2 కోట్లు తీసుకుని వదిలేశాడో ఎస్‌ఐ! అతడు పరారయ్యాడంటూ...

Financial Fraud: రూ.3 వేల కోట్ల ఆర్థిక మోసం కేసు నిందితుణ్ని..రూ.2 కోట్లు తీసుకుని వదిలేసిన ఎస్‌ఐ

  • ముంబై నుంచి తీసుకొస్తూ మార్గమధ్యంలో డీల్‌.. అతడి కుటుంబసభ్యుల నుంచి డబ్బు వసూలు

  • ఆపై అతడు పారిపోవడానికి సహకారం

  • పరారయ్యాడని పైఅధికారులకు మస్కా

  • అంతర్గత విచారణలో రట్టయిన గుట్టు

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): సుమారు రూ.3 వేల కోట్ల విలువైన ఆర్థిక మోసం కేసులో నిందితుణ్ని.. రూ.2 కోట్లు తీసుకుని వదిలేశాడో ఎస్‌ఐ! అతడు పరారయ్యాడంటూ పై అధికారులకు సమాచారమిచ్చాడు. అయితే.. సీపీ సజ్జనార్‌ ఆదేశాల మేరకు అధికారులు విచారణ జరపగా.. విస్తుపోయే విషయాలు తెలిసినట్లు సమాచారం. పోలీసు వర్గాలు తెలిపిన ప్రకారం.. సుమారు 3 వేల కోట్ల రూపాయల విలువైన ఆర్థిక మోసానికి సంబంధించి ఇటీవల ఒక కేసు నమోదైంది. పలు వ్యాపారాల్లో పెట్టుబడితే లాభాలిస్తామంటూ డబ్బు కొల్లగొట్టిన నిందితుణ్ని పట్టుకునేందుకు పోలీసులు ఒక టాస్క్‌ఫోర్స్‌ బృందాన్ని ఏర్పాటు చేశారు. దర్యాప్తు చేసిన ఆ బృందం.. నిందితుడు మహారాష్ట్రలోని ఓ ప్రాంతంలో తలదాచుకున్నట్లు గుర్తించింది. అతణ్ని పట్టుకునేందుకు నిబంధనల ప్రకారం ఒక సీఐ నేతృత్వంలోని బృందాన్ని అక్కడికి పంపించాల్సి ఉండగా.. ఓ ఎస్‌ఐ నేతృత్వంలోని టీమ్‌ను పంపించారు. ఆ బృందం అతణ్ని పట్టుకుని హైదరాబాద్‌కు తరలించేందుకు సిద్ధమైంది. ఆ సమయంలోనే.. సదరు సీఐ ఒక మాస్టర్‌ ప్లాన్‌ వేశాడు. తన బృందంలోని ఇతర సభ్యులకు తెలియకుండా.. రూ.2 కోట్లు ఇస్తే వదిలేస్తానంటూ నిందితుడితో ఒప్పందం కుదుర్చుకున్నాడు.


వాహనాల మధ్య దూరం ఉండేలా..

నిందితుడితో డీల్‌ కుదుర్చుకున్న ఎస్‌ఐ.. తన బృందంలోని మిగతా సిబ్బంది అందరినీ ఒక వాహనంలో ఎక్కించి, తాను మాత్రం నిందితుడి వాహనంలో ఎక్కి హైదరాబాద్‌కు బయలు దేరాడు. ముందు బయలుదేరిన పోలీసు సిబ్బంది వాహనానికి.. తాను ప్రయాణిస్తున్న వాహనానికి మధ్య 30 కి.మీ దూరం ఉండేలా ప్లాన్‌ చేసుకున్నాడు. రూ.2 కోట్లు తీసుకుని ఫలానా హోటల్‌ వద్దకు రావాలంటూ.. నిందితుడి కుటుంబసభ్యులను ఫోన్‌ ద్వారా ఆదేశించాడు. వారు ఆ ఎస్‌ఐ చెప్పినట్టుగా ఒక హోటల్‌ వద్దకు వచ్చారు. నిందితునితో కలిసి ఆ హోటల్‌కు వెళ్లిన ఎస్‌ఐ.. వారి నుంచి డబ్బు తీసుకొని అతణ్ని వదిలేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. అనంతరం.. తాను దారిలో వాహనాన్ని ఆపినప్పుడు నిందితుడు తప్పించుకు పారిపోయాడంటూ ఉన్నతాధికారులకు, టాస్క్‌ఫోర్స్‌ బృందానికి సమాచారం ఇచ్చాడు. టాస్క్‌ఫోర్స్‌ ఉన్నతాధికారులు 2-3 బృందాలను రంగంలోకి దింపి నిందితుణ్ని పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు. దర్యాప్తు క్రమంలో.. ఎస్‌ఐ తీరుపై పోలీసు ఉన్నతాధికారులకు అనుమానం వచ్చింది. ఎస్‌ఐ ప్రమేయంతోనే నిందితుడు తప్పించుకొని ఉంటాడని అనుమానించిన అధికారులు డిపార్టుమెంటల్‌ విచారణకు ఆదేశించారు. ఈ విచారణలో.. ఎస్‌ఐ డబ్బు తీసుకుని నిందితుణ్ని వదిలేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయినట్లు తెలిసింది. ఆ డబ్బు ఎక్కడ తీసుకున్నాడు? ఎలా తీసుకున్నాడు? ఎక్కడికి తరలించాడు? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 2020 బ్యాచ్‌కు చెందిన ఆ ఎస్‌ఐ తొలి నుంచీ అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా పోలీసు దర్యాప్తులో వెల్లడైనట్టు సమాచారం. టాస్క్‌ఫోర్సు విభాగంలో చేరినప్పటి నుంచి అతడు గుట్టుగా అనేక దందాలు, సెటిల్‌మెంట్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. అతడికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Updated Date - Oct 28 , 2025 | 04:33 AM