SI Accused of Misusing Service Revolver: బెట్టింగ్ కోసం రూ.కోటి అప్పు
ABN , Publish Date - Dec 04 , 2025 | 04:44 AM
ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసై.. దొరికినచోటల్లా అప్పులు చేసి, నేరస్తుల నుంచి రికవరీ చేసిన బంగారాన్ని సైతం తాకట్టుపెట్టి సస్పెండైన అంబర్‌పేట డిటెక్టివ్ ఎస్సై భానుప్రకాశ్‌రెడ్డి విచారణలో...
రికవరీ బంగారం, రివాల్వర్ కూడా తాకట్టు!
రివాల్వర్ గుట్టు విప్పని ఎస్సై భానుప్రకాశ్
రివాల్వర్ ఎక్కడో పోయిందని విచారణలో వెల్లడి
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసై.. దొరికినచోటల్లా అప్పులు చేసి, నేరస్తుల నుంచి రికవరీ చేసిన బంగారాన్ని సైతం తాకట్టుపెట్టి సస్పెండైన అంబర్‌పేట డిటెక్టివ్ ఎస్సై భానుప్రకాశ్‌రెడ్డి విచారణలో పోలీసులకు సహకరించటం లేదని తెలిసింది. ఆయన డబ్బుకోసం సర్వీస్ రివాల్వర్‌ను సైతం తాకట్టు పెట్టారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే, అది కనిపించకుండా పోయిందని చెప్తుండటంతో ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. హైదరాబాద్ సిటీ కమిషనరేట్ చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదని చెబుతున్నారు.
రూ.కోటికిపైగా అప్పులు..
ఆంధ్రప్రదేశ్‌లోని రాయచోటికి చెందిన భానుప్రకాశ్‌రెడ్డి తెలంగాణలో నాన్‌లోకల్ కోటాలో 2020 బ్యాచ్ సివిల్ ఎస్సైగా ఎంపికయ్యాడు. గతేడాది అంబర్‌పేట పీఎ్‌సకు డీఎస్సై (డిటెక్టివ్ ఎస్సై)గా వెళ్లాడు. అయితే, ఎస్సైగా ఎంపికైనప్పటి నుంచే అతడు ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటుపడ్డాడని సమాచారం. బెట్టింగ్‌లకు బానిసై దొరికినచోటల్లా అధిక వడ్డీలకు అప్పులు చేశాడు. నాలుగేళ్లలో రూ.కోటిపైగా అప్పులు చేసినట్లు విచారణలో గుర్తించినట్లు తెలిసింది. అతడి తల్లి కొంత వ్యవసాయ భూమిని అమ్మి కొడుకు చేసిన అప్పుల్లో రూ.45 లక్షల వరకు తీర్చినట్లు గుర్తించారు. అయినా, అతడు బెట్టింగ్‌ను మానుకోలేదు. వచ్చే జీతం సరిపోకపోవడంతో స్టేషన్‌లో తోటి ఉద్యోగల వద్ద కూడా అప్పులు చేసినట్లు విచారణలో తేలింది.
రివాల్వర్ గుట్టు విప్పని భానుప్రకాశ్..
ఏపీలో నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలో ఉద్యోగం సాధించిన భానుప్రకాశ్.. ఎస్సై ఉద్యోగం నుంచి రిలీవ్‌లో భాగంగా సర్వీస్ రివాల్వర్‌ను అప్పగించాలని అధికారులు ఆదేశించటంతో, అది కనిపించడంలేదని చెప్పాడు. దాంతో ఉన్నతాధికారులు ఆరా తీయటంతో ఆయన బెట్టింగ్ బాగోతం వెలుగులోకి వచ్చింది. బుల్లెట్లు తనవ ద్దే ఉన్నాయని చెప్పిన భానుప్రకాశ్.. రివాల్వర్ ఏమైందన్న విషయం మాత్రం చెప్పడం లేదని తెలిసింది. డబ్బుకోసం ఖాళీ రివాల్వర్‌ను కూడా ఆయన తాకట్టుపెట్టినట్లు ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. మరోవైపు ఇటీవల పలు నేరాల్లో అరెస్టై అంబర్‌పేట పోలీ్‌సస్టేషన్‌కు వచ్చిన కొంతమంది నేరస్తులను కూడా ఈ కేసులో విచారిస్తున్నట్లు సమాచారం. స్టేషన్‌కు తీసుకొచ్చిన సమయంలో వారిలో ఎవరైనా డెస్క్‌లోంచి రివాల్వర్‌ను చోరీ చేసి ఉంటారా? అనే కోణంలో విచారిస్తున్నారు. కానీ అందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిసింది. దీంతో కావాలనే భానుప్రకాశ్ రివాల్వర్ విషయం దాచిపెడుతున్నట్లు ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు.