Share News

Show Cause Notices: నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 14 నర్సింగ్‌ స్కూళ్లకు షోకాజ్‌

ABN , Publish Date - Oct 20 , 2025 | 04:31 AM

బంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 14 నర్సింగ్‌ విద్యాసంస్థలకు వైద్య విద్య సంచాలకుడు (అకడమిక్‌) షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు...

Show Cause Notices: నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 14 నర్సింగ్‌ స్కూళ్లకు షోకాజ్‌

  • వారంలో సమాధానమివ్వాలని ఆదేశించిన వైద్యశాఖ

  • 23 చోట్ల ముగిసిన తనిఖీలు.. ప్రభుత్వానికి నివేదిక

హైదరాబాద్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 14 నర్సింగ్‌ విద్యాసంస్థలకు వైద్య విద్య సంచాలకుడు (అకడమిక్‌) షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల్లో పేర్కొన్న అంశాలకు వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. వాటిలో ఏడు నర్సింగ్‌ కాలేజీలు ప్రభుత్వం వద్ద అనుమతి తీసుకున్నప్పుడు ఇచ్చిన చిరునామా ఒకటి కాగా.. ప్రస్తుతం అవి నడుస్తున్నది మరొకచోట అనే విషయం తనిఖీల్లో వెలుగుచూసింది. మరో ఏడు నర్సింగ్‌ స్కూల్స్‌లో.. ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌ నిబంధనల మేరకు కనీస మౌలిక సదుపాయాలు లేవని, తగినంతమంది అధ్యాపకులు లేరని తేలింది. నిబంధనల ప్రకారం లేని నర్సింగ్‌ విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలంటూ ప్రభుత్వానికి వైద్యశాఖ నివేదిక ఇచ్చినట్లు సమాచారం. తెలంగాణలో నర్సింగ్‌ స్కూల్స్‌, కాలేజీలపై ప్రభుత్వానికి కొన్నాళ్లుగా పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో ఈ అంశంపై దృష్టి సారించిన వైద్య ఆరోగ్య శాఖ మంతిర దామోదర రాజనర్సింహ.. తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, నల్లగొండ జిల్లాల్లో పలు నర్సింగ్‌ స్కూల్స్‌, కాలేజీలపై నర్సింగ్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలోని బృందాలు తనిఖీలు చేశాయి. మొత్తం 23 నర్సింగ్‌ స్కూల్స్‌పై ప్రాథమికంగా సర్కారుకు ఫిర్యాదులందినట్లు సమాచారం. ఒక్కో నర్సింగ్‌ ఇన్సిస్ట్యూట్‌కు ఇద్దరేసి చొప్పున మొత్తం 46 మంది అధికారులు తనిఖీలు చేశారు. రెండు రోజుల పాటు తనిఖీల అనంతరం వాటిలో లోపాలు, నిబంధనల పాటించని కాలేజీలపై అకడమిక్‌ డీఎంఈ నివేదిక రూపొందించి, ప్రభుత్వానికి నివేదించారు.

ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం

ప్రభుత్వ ఆదేశాల మేరకు 23 నర్సింగ్‌ స్కూల్స్‌లో రెండు రోజుల పాటు తనిఖీలు నిర్వహించాం. ఆయా విద్యాసంస్థల్లో ఐఎన్‌సీ నిబంధనల మేరకు అధ్యాపకులు ఉన్నారా? మౌలిక సదుపాయాలున్నాయా లేవా తదితర అంశాలను అధికారులు పరిశీలించారు. ప్రభుత్వం అనుమతిచ్చిన చోట నే స్కూల్‌ నడుపుతున్నారా లేదా అనే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నాం. తనిఖీలకు వెళ్లిన అధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగా ప్రభుత్వానికి సమగ్ర నివేదికను ఇచ్చాం. మా నివేదిక ఆధారంగా.. నిబంధనల ప్రకారం నడవని నర్సింగ్‌ స్కూల్స్‌పై చర్యలుంటాయి.

- డాక్టర్‌ శివరాంప్రసాద్‌( డీఎంఈ, అకడమిక్‌)

Updated Date - Oct 20 , 2025 | 04:31 AM