Share News

Shivadhar Reddy: నూతన డీజీపీగా శివధర్‌రెడ్డి

ABN , Publish Date - Sep 27 , 2025 | 04:24 AM

రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ డీజీపీగా బత్తుల శివధర్‌రెడ్డి నియమితులరు. ప్రస్తుత డీజీపీ జితేందర్‌ ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు...

Shivadhar Reddy: నూతన డీజీపీగా శివధర్‌రెడ్డి

  • నెలాఖరున పదవీ విరమణ చేయనున్న జితేందర్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ)గా బత్తుల శివధర్‌రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుత డీజీపీ జితేందర్‌ ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. దీంతో నూతన డీజీపీగా 1994 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి బి.శివధర్‌రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌ విభాగం డీజీగా ఉన్న శివధర్‌రెడ్డికి రాష్ట్ర డీజీపీగా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా శివధర్‌రెడ్డి నియామక ఉత్తర్వులను అందుకున్నారు. అక్టోబరు 1న ఆయన డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. శివధర్‌రెడ్డి స్వస్థలం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తూలేకలాన్‌(పెద్దతుండ్ల) గ్రామం. ఆయన జన్మించింది మాత్రం హైదరాబాద్‌లోనే. విద్యాభ్యాసమంతా హైదరాబాద్‌లోనే జరిగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి, కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. తర్వాత సివిల్స్‌ పరీక్షలు రాసి, 1994లో ఐపీఎ్‌సకు ఎంపికయ్యారు. ఏపీ క్యాడర్‌లో చేరారు. ఆయన ఏఎస్పీగా అనకాపల్లి, నర్సీపట్నం, చింతపల్లిలో పనిచేశారు. ఆ తర్వాత అదనపు ఎస్పీగా పదోన్నతి పొంది గ్రేహౌండ్స్‌లో బెల్లంపల్లి, ఆదిలాబాద్‌లో పనిచేశారు. అనంతరం నల్లగొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాల ఎస్పీగా విధులు నిర్వర్తించారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని సౌత్‌జోన్‌ డీసీపీగాను పనిచేశారు. తర్వాత స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో ఎస్పీగా, డీఐజీగా సేవలందించారు. ఐరాస శాంతి పరిరక్షక దళంలో భాగంగా శివధర్‌రెడ్డి కొసావోలో పనిచేశారు. విశాఖపట్నం కమిషనర్‌గాను ఆయన సుదీర్ఘకాలం కొనసాగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏసీబీ అదనపు డీజీ, డీజీ హోదాల్లో పనిచేశారు. తర్వాత డీజీపీ కార్యాలయంలోని పర్సనల్‌ వింగ్‌లో ఐజీ, అదనపు డీజీ పోస్టుల్లోనూ సేవలందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా శివధర్‌రెడ్డి పనిచేశారు. ఆ సమయంలోనే నయీం ఎన్‌కౌంటర్‌ వంటి కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ ఆయన్ను ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా నియమించారు. ఆయనకు గ్యాలంట్రీ మెడల్‌, పోలీస్‌ పతకం, రాష్ట్రపతి పోలీసు పతకం, ఐరాస పతకంతో పాటు పలు ప్రతిభా పురస్కారాలు దక్కాయి. నక్సల్స్‌ వ్యతిరేక ఆపరేషన్లను సమర్థంగా నిర్వహించారన్న పేరు తెచ్చుకున్నారు.


ఆయన పాతబస్తీ డీసీపీగా ఉన్న సమయంలోనే మక్కా మసీదులో బాంబు పేలుడు జరగ్గా.. ఆ సమయంలో అల్లర్లు మరింత విస్తరించకుండా కట్టడి చేశారు. రోడ్‌ సేఫ్టీ విభాగం, రైల్వే పోలీసు విభాగంలోనూ ఆయన పనిచేశారు. శివధర్‌రెడ్డికి భార్య హేమలత, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృదు స్వభావి, వివాద రహితుడు, పోలీసుల పట్ల మానవీయ కోణం ఉన్న శివధర్‌రెడ్డిని డీజీపీగా నియమించడాన్ని స్వాగతిస్తున్నట్లు పోలీసు అధికారుల సంఘం సభ్యులు పేర్కొన్నారు. కాగా, నూతన డీజీపీ నియామకం పూర్తవడంతో ప్రభుత్వం ఐపీఎ్‌సల బదిలీలపై దృష్టి సారించింది. పలు పోస్టుల్లో సుదీర్ఘకాలం పనిచేస్తున్న వారితో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని బదిలీ చేయడానికి కసరత్తు ప్రారంభించింది. కీలక పోస్టుల్లో ఉన్న పలువురు ఐపీఎ్‌సల బదిలీలు జరగవచ్చని తెలుస్తోంది. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఎవరిని నియమిస్తారన్న విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొంతమంది పోలీసు కమిషనర్లు, డీఐజీలు, ఐజీలు, ఎస్పీలు, డీసీపీలను సైతం బదిలీ చేస్తారని సమాచారం. సీఎం రేవంత్‌రెడ్డి ఆశించిన మేరకు పనితీరు లేని ఐపీఎ్‌సలపై బదిలీ వేటు తప్పదని సమాచారం.

Updated Date - Sep 27 , 2025 | 04:24 AM