Congress senior leader Shashi Tharoor: ఏఐసీసీ అధ్యక్ష పదవికి మళ్లీ పోటీ చేయను!
ABN , Publish Date - Nov 14 , 2025 | 04:43 AM
తంలో రాజకీయ నాయకుల మధ్య ఆలోచనా విధానంలో భిన్నాభిప్రాయాలున్నా.. అవి ఆ అంశాల వరకే పరిమితమై ఉండేవని..
కాంగ్రె్‌సలో అంతర్గత ప్రజాస్వామ్యం వల్ల ఏమైనా చేయొచ్చు
అది ఏ రాజకీయ పార్టీకైనా ఉండాల్సిన గొప్ప లక్షణం
యువతకు ఉపయోగపడే పుస్తకం.. మహాభారతమే
జ్యోతి కొమిరెడ్డి స్మారక ఉపన్యాసంలో శశిథరూర్
హైదరాబాద్ సిటీ, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): గతంలో రాజకీయ నాయకుల మధ్య ఆలోచనా విధానంలో భిన్నాభిప్రాయాలున్నా.. అవి ఆ అంశాల వరకే పరిమితమై ఉండేవని.. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకునేవారని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ అన్నారు. నెహ్రూ-వాజపేయి, ఇందిరాగాంధీ-వాజపేయి హయాంలో కూడా అది కనిపించిందని ఆయన గుర్తుచేశారు. హైదరాబాద్ సోమాజీగూడలోని ఓ హోటల్‌లో మాజీ ఎంఎల్‌ఏ జ్యోతి కొమిరెడ్డి స్మారకసభలో ఆయన పాల్గొని.. ‘రాడికల్ సెంట్రిజం.. మై విజన్ ఫర్ ఇండియా’ అనే అంశంపై ప్రసంగించారు. జ్యోతి కొమిరెడ్డి గొప్ప న్యాయవాది అని.. మహిళల హక్కుల కోసం నినదించిన మానవతావాది అని, చట్ట సభల్లో 33ు మహిళలకు రిజర్వేషన్ల కేటాయింపు కోసం పోరాడారని కొనియాడారు. తన ప్రసంగంలో భాగంగా ఆయనప్రస్తుత రాజకీయాలు సహా పలు అంశాల గురించి మాట్లాడారు. ఏఐసీసీ ప్రెసిడెంట్‌గా మళ్లీ పోటీ చేస్తారా? అనే ప్రశ్నకు.. ‘‘ఐన్‌స్టీన్ చెప్పినట్లు.. పిచ్చితనం నిర్వచనం ఏమిటంటే.. ఎటువంటి ఫలితాలను ఆశించకుండా అదే (ఒకే) పనిచేయడం’’ అని నవ్వుతూ సమాధానమిచ్చారు. తాను పోటీ చేయననే విషయాన్ని చెప్పకనే చెప్పారు. దీనిపై మరింత వివరణ ఇస్తూ.. ‘‘అప్పటి పరిస్ధితులు వేరు. అప్పుడు పోటీ చేయడం వల్ల పొందిన అనుభవాలను పబ్లిక్‌గా చెప్పలేను. కానీ. ఒకటి మాత్రం చెప్పగలను. కాంగ్రె్‌సలో అంతర్గత ప్రజాస్వామ్యం వల్ల ఏమైనా చేయొచ్చు. అది ఏ రాజకీయ పార్టీకైనా ఉండాల్సిన గొప్ప లక్షణం. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు పార్టీలు కూడా ప్రజాస్వామ్యయుతంగానే ఉండాలి... అంత వరకే మాట్లాడగలను’’ అని వ్యాఖ్యానించారు. దేశ సమగ్రత, సార్వభౌమత్వానికి సవాళ్లు ఎదురయ్యే పహల్గాం లాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు ప్రతిపక్షాల విమర్శలు బాధ్యతాయుతంగా, నిర్మాణాత్మకంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. పౌర హక్కుల ఉద్యమానికి తానెప్పుడూ మద్దతుదారునే అని.. అణగారిన వర్గాల పక్షాన మాట్లాడటానికి సిద్ధంగా ఉంటానని స్పష్టం చేసిన శశిథరూర్.., రాజ్యాంగ విలువలకు పూర్తి విరుద్ధమైన భావాలు కలిగిన వామపక్ష తీవ్రవాదాన్ని మాత్రం తాను సమర్ధించనని కరాఖండీగా చెప్పారు. యువత రాజకీయాల్లోకి రావాలనుకుంటే ముందుగా ‘ఎందుకు?’ అనే ప్రశ్న వారే వేసుకోవాలని సూచించారు. డబ్బు సంపాదన గురించి రాజకీయాల్లోకి రావాలనుకోవడం తప్పని స్పష్టం చేశారు. యువతకు ఉపయోగపడే ఏదైనా పుస్తకం గురించి చెప్పాలని అడిగితే.. మహాభారతం చదవమని చెబుతానన్నారు. కోర్టుల్లో ఏళ్లతరబడి సాగుతున్న కేసుల పరిష్కారానికి కృత్రిమ మేధను వినియోగించాలని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో ఏది బాగా నచ్చిందని అడిగినప్పుడు.. రోడ్లు బాగున్నాయని చెప్పారు.