Share News

Sale of Fake Seeds: నకిలీ విత్తనాలు అమ్మితే 30 లక్షల దాకా జరిమానా!

ABN , Publish Date - Dec 11 , 2025 | 05:00 AM

నకిలీ విత్తనాలు విక్రయించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు చేసింది. ఎలాంటి రిజిస్ట్రేషన్‌ లేకుండా విత్తనాల విక్రయం....

Sale of Fake Seeds: నకిలీ విత్తనాలు అమ్మితే 30 లక్షల దాకా జరిమానా!

  • మూడేళ్ల జైలు సహా విత్తన సంస్థలపై ఐదేళ్ల నిషేధం

  • విత్తన ధరలను రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించాలి

  • కేంద్ర విత్తన చట్టం-25 ముసాయిదాకు ప్రతిపాదనలు

  • రాష్ట్ర ప్రభుత్వ సూచనలు వెల్లడించిన మంత్రి తుమ్మల

హైదరాబాద్‌, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): నకిలీ విత్తనాలు విక్రయించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు చేసింది. ఎలాంటి రిజిస్ట్రేషన్‌ లేకుండా విత్తనాల విక్రయం, నకిలీ/నాసిరకం విత్తనాలు రైతులకు అంటగట్టడం, లేబుల్స్‌ లేకుండా సరఫరా చేయడం లాంటి అక్రమాలకు పాల్పడే విత్తనోత్పత్తి సంస్థలకు రూ.50 వేల నుంచి 30 లక్షల వరకు జరిమానా విధించాలని సూచించింది. విత్తనచట్టం-2025 ముసాయిదాపై నెల రోజులపాటు వివిధ వర్గాలతో చర్చించిన రాష్ట్ర వ్యవసాయశాఖ.. పలు సూచనలతో తుది నివేదికను సిద్ధం చేసింది. అభ్యంతరాలు తెలపడానికి గురువారంతో గడువు ముగుస్తోంది. ఈ క్రమంలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతుల ప్రయోజనాల కోసం ముసాయిదాలో చేర్చాల్సిన, మార్చాల్సిన అంశాలను తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ సూచనలు

  • ప్రత్యేకమైన రకాలను నమోదు చేయడానికి రాష్ట్ర విత్తన కమిటీకి, రాష్ట్రానికి అధికారం ఇవ్వాలి. ఎందుకంటే స్థానిక రైతులకు ఎలాంటి విత్తనాలు కావాలి? వారి అవసరాలేంటి? వాతావరణం ఎలా ఉంటుంది? అనే వివరాలు రాష్ట్ర ప్రభుత్వం వద్దే ఉంటాయి.

  • ప్రతి విత్తనోత్పత్తి సంస్థ నిర్వాహకుడు, విత్తన డీలర్లు, పంపిణీదారులుకనీస విద్యార్హతగా వ్యవసాయంలో డిగ్రీ/డిప్లొమా కలిగి ఉండాలి. లేదంటే ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలో 3 నెలల సర్టిఫికెట్‌ కోర్సు పూర్తిచేసి ఉండాలి.

  • అన్నిరకాల విత్తనాలను గుర్తింపు పొందిన సంస్థతో ధ్రువీకరించాలి. స్వీయ ధ్రువీకరణకు అనుమతి ఇవ్వకూడదు.

  • రైతుల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు విత్తన ధరలను నియంత్రించే అధికారం కల్పించాలి.

  • దిగుమతి చేసుకున్న విత్తనాలన్నింటికీ కనీసం రెండేళ్లు.. ఐసీఏఆర్‌, ఎస్‌ఏయూ కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించి, విజయవంతమైన తర్వాతే ఇక్కడి రైతులకు మార్కెటింగ్‌ చేయాలి.

రైతులు, రైతు సంఘాల సూచనలు

  • నకిలీ/నాసిరకం విత్తనాలతో నష్టపోయిన రైతులకు 60రోజుల్లోగా పరిహారం అందించాలి. అత్యధిక దిగుబడి ఆధారంగానే పరిహారాన్ని లెక్కించాలి. విత్తనాలను సరసమైన ధరల్లో రైతులకు అమ్మడానికి విత్తన ధరల నియంత్రణ తప్పనిసరిగా ఉండాలి.

  • సంప్రదాయ విత్తనాలు, వారసత్వ విత్తనాలు, డిజిటల్‌ సీక్వెన్స్‌ ఇన్‌ఫర్మేషన్‌ (డీఎ్‌సఐ)ను రక్షించడానికి ప్రత్యేక చర్యలు ఉండాలి.

రాష్ట్ర ప్రతిపాదనలను బిల్లులో చేర్చాలి: తుమ్మల

‘‘విత్తన చట్టంపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను కేంద్రం పరిగణనలోకి తీసుకొని విత్తన బిల్లులో చేర్చాలి. నకిలీ, నాసిరకం విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతుల ప్రయోజనాలను పరిరక్షించేలా చట్టాలు లేకపోవడంతో నష్టపోతున్నారు. ఈ క్రమంలో కఠినమైన చట్టాలను రూపొందించాల్సిన అవసరం ఉంది’’ అని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

Updated Date - Dec 11 , 2025 | 05:02 AM