Share News

Severe Cold Wave: నేటి నుంచి నాలుగు రోజులు భీకరమైన చలి

ABN , Publish Date - Dec 18 , 2025 | 03:29 AM

శీతల గాలుల ప్రభావంతో తెలంగాణలో ఈ నెల 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో సింగిల్‌ డిజిట్‌...

Severe Cold Wave: నేటి నుంచి నాలుగు రోజులు భీకరమైన చలి

  • చలి గుప్పిట్లో కోహీర్‌

  • 15 రోజులుగా సింగిల్‌ డిజిట్‌ ఉష్ణోగ్రతలు నమోదు

ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌: శీతల గాలుల ప్రభావంతో తెలంగాణలో ఈ నెల 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో సింగిల్‌ డిజిట్‌ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సంగతి తెలిసిందే. కాగా సంగారెడ్డి జిల్లా కోహీర్‌ మండలం చలి గుప్పిట్లో చిక్కుకుంది. గతంలో ఎన్నడు లేనివిధంగా పక్షం రోజుల నుంచి కోహీర్‌లో సింగిల్‌ డిజిట్‌ ఉష్ణోగ్రతలే నమోదు కావడంతో ఆ ప్రాంత ప్రజలు రోజూ చలితో ఇబ్బందులు పడక తప్పడంలేదు. బుధవారం ఉదయం కోహీర్‌లో 7.3 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు కాగా మెదక్‌ జిల్లాలోని దామరంచలో 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. ఇక సిద్దిపేట జిల్లాలోని పోతిరెడ్డి పేటలో 9.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. ఏటా రాష్ట్రంలోని కొమరంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. కానీ ఈసారి సంగారెడ్డి జిల్లాలోని కోహీర్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

రైళ్లలో ఏసీ తరగతులకు తగ్గిన ఆదరణ

చలి ప్రభావంతో రైళ్లలో ఏసీ తరగతులకు ఆదరణ తగ్గింది. దీంతో సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లే 22204/22203 దురంతో ఎక్స్‌ప్రెస్‌, సికింద్రాబాద్‌-అనకాపల్లి మధ్య నడుస్తున్న 07055/ 07056 స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌, సికింద్రాబాద్‌ నుంచి ముంబై వెళ్లే 12220/12219 దురంతో ఎక్స్‌ప్రె్‌సలలో థర్డ్‌ ఏసీ కోచ్‌ను తగ్గించి, స్లీపర్‌ క్లాస్‌ కోచ్‌ను జత చేసినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. కాగా, చలికి తోడు పొగమంచు దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతోంది. తెల్లవారు జామున మూడు, నాలుగు గంట ల నుంచి ఉదయం 10 గంటల వరకు పొగమంచు కమ్మేయడంతో జనజీవనం స్తంభిస్తోంది. రోడ్డు ప్ర మాదాలు పెరుగుతున్నాయి. ఉత్తరాదిలో ప్రధానం గా ఢిల్లీ, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌తోపాటు దేశంలోని పారిశ్రామిక ప్రాంతాలు, నగరాలు, పట్టణాల్లో పొగమంచు కురుస్తోందని వాతావరణ నిపుణులు తెలిపారు. అధిక పీడనం ప్రభావానికి తోడు తూర్పు గాలులు, వెస్ట్రన్‌ డిస్ట్రబెన్స్‌ బలహీనంగా ఉండడంతో పొగమంచు కురుస్తోందని వాతావరణ శాఖ అధికారి సముద్రాల జగన్నాథకుమార్‌ తెలిపారు.

Updated Date - Dec 18 , 2025 | 03:29 AM