Cold Wave: బాబోయ్ చలి
ABN , Publish Date - Dec 19 , 2025 | 05:00 AM
రాష్ట్రంలో చలి ప్రభావం కొనసాగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు రోజురోజుకి పడిపోతుండగా శీతల గాలుల ప్రభావంతో జనం వణికిపోతున్నారు..
సిర్పూర్(యు)లో 5.7, కోహీర్, గిన్నెధరిలో 6.4 డిగ్రీలు
ఆదిలాబాద్ జిల్లాలో పాఠశాల వేళల్లో మార్పులు
హైదరాబాద్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ టౌన్, కోహీర్, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చలి ప్రభావం కొనసాగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు రోజురోజుకి పడిపోతుండగా శీతల గాలుల ప్రభావంతో జనం వణికిపోతున్నారు. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యు)లో గురువారం 5.7 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గిన్నెధరి, సంగారెడ్డి జిల్లాలోని కోిహీర్‌లో 6.4డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో 6.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆసిఫాబాద్, సంగారెడ్డి, రాజన్నసిరిసిల్ల, ఆదిలాబాద్, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో 10 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 10 నుంచి 15 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకి పెరుగుతుండడంతో పాఠశాల సమయాల్లో మార్పులు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు ఉన్న పాఠశాల సమయాలను సవరించి ఉదయం 9.40 నుంచి సాయంత్రం 4.30 వరకు కొనసాగేలా నిర్ణయించారు.