Share News

Cold wave: వామ్మో.. చలి!

ABN , Publish Date - Dec 22 , 2025 | 05:08 AM

రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. పలు జిల్లాలు చలి పులి పంజాకు చిక్కి విలవిల్లాడుతున్నాయి. ఆసిఫాబాద్‌ ఏజెన్సీ ప్రాంతంలో తీవ్రత మరింత ఎక్కువగా ఉంది....

Cold wave: వామ్మో.. చలి!

రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. పలు జిల్లాలు చలి పులి పంజాకు చిక్కి విలవిల్లాడుతున్నాయి. ఆసిఫాబాద్‌ ఏజెన్సీ ప్రాంతంలో తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. చలితో పాటు పొగమంచు కమ్ముకుంటుండటంతో ఉదయం 9 గంటలైనా ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఆదివారం 14 జిల్లాల్లో సింగిల్‌ డిజిట్‌లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో అత్యల్పంగా 5 డిగ్రీలు, ఆసిఫాబాద్‌ జిల్లా గిన్నెధరిలో 7.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రంగారెడ్డి, వికారాబాద్‌, ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్‌, కామారెడ్డి, నిజామాబాద్‌, సిద్దిపేట, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, నిర్మల్‌, నారాయణపేట, మహబూబ్‌నగర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 6.9 నుంచి 9.9 డిగ్రీల మధ్య కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇటు గ్రేటర్‌ హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లిలో 8.3, రాజేంద్రనగర్‌లో 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కరీంనగర్‌ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో చలిమంట కాగుతుండగా ప్రమాదవశాత్తు నిప్పంటుకొని రామంచ నర్సవ్వ (85) మృతి చెందింది. ఇంటి ఎదుట ప్లాస్టిక్‌ కుర్చీలో కూర్చొని నర్సవ్వ చలిమంట కాగుతుండగా.. ఆ వేడికి కుర్చీ కాలు విరిగిపోయి మంటలో ఆమె పడిపోవడంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయింది. ఇక ఈ నెల చివరి వరకు చలి తీవ్రత కొనసాగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Updated Date - Dec 22 , 2025 | 05:08 AM