Health Risks Rise: చలి ముట్టడిలో తెలంగాణ
ABN , Publish Date - Nov 13 , 2025 | 05:21 AM
రాష్ట్రంలో ఎన్నడూ లేనట్టుగా చలి తీవ్రత బాగా పెరిగింది. ఒక్కసారిగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మరికొన్ని రోజులూ ఇదే పరిస్థితి ఉంటుందని...
రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత
వచ్చే 3, 4 రోజులు మరింత చలి
8.5 డిగ్రీలకు పడిపోయే అవకాశం
సిర్పూర్(యూ)లో 10.2 డిగ్రీలు నమోదు
హైదరాబాద్/ఆసిఫాబాద్/ఆదిలాబాద్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎన్నడూ లేనట్టుగా చలి తీవ్రత బాగా పెరిగింది. ఒక్కసారిగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మరికొన్ని రోజులూ ఇదే పరిస్థితి ఉంటుందని, చలి మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్రం తీవ్ర చలి ప్రభావిత (కోర్ కోల్డ్ వేవ్) జోన్‌లో ఉందని కేంద్ర వైద్యారోగ్య శాఖ ఆఽధ్వర్యంలోని నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ క్లైమెట్ ఛేంజ్ అండ్ హ్యూమన్ హెల్త్ (ఎన్‌పీసీసీహెచ్‌హెచ్) గత ఏడాది ప్రకటించింది. ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుందని వాతావరణ నిపుణులు తెలిపారు. కనిష్ట ఉష్ణోగ్రతలు 8.5 డిగ్రీల వరకు పడిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇక చలి వాతావరణంలో జాగ్రత్తగా ఉండాలని, లేకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూడు, నాలుగు రోజులుగా శ్వాసకోశ సమస్యలు, జలుబు, దగ్గు, జ్వరాలతో ఆస్పత్రులకు వస్తున్న రోగుల సంఖ్య పెరుగుతోందని చెబుతున్నారు.
చలితీవ్రతతో వచ్చే ఆరోగ్య సమస్యలెన్నో
తీవ్రమైన చలి కారణంగా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా హైపోథెర్మియా (శరీర ఉష్ణోగ్రత పడిపోవడం), చర్మం లోపలి కణజాలం గడ్డకట్టి గాయాలవడం (ఫ్రాస్ట్‌బైట్) వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. చల్లని వాతావరణం కారణంగా రోగ నిరోధక శక్తి మందగిస్తుంది. వైర్‌సలు సులభంగా వ్యాప్తి చెందుతాయి. న్యూమోనియా, ఇతర శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. ఆస్తమా, సీవోపీడీ (క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్) దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధుల లక్షణాలు తీవ్రతరం అవుతాయి. జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, తుమ్ములు, తలనొప్పి, ముక్కు కారడం వంటి సమస్యలు వస్తాయి. ఇక చర్మ సమస్యల ( డ్రైస్కిన్, చర్మం పగిలిపోవడం, దురద) తీవ్రత పెరుగుతుంది. తీవ్రమైన చలికి లోనైతే రక్తనాళాలు కుంచించుకుపోవడం వల్ల రక్తపోటు, గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వీరికి మరింత అప్రమత్తత అవసరం
చలి తీవ్రత నేపథ్యంలో ముఖ్యంగా చిన్నారులు, పెద్ద వయసువారికి సమస్యలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. దివ్యాంగులు, గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువుల నుంచి ఐదేళ్లలోపు వయసున్న చిన్నారులు, చలిలో ఆరుబయట పనిచేేస కార్మికులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. శరీరాన్ని వెచ్చగా ఉంచే దుస్తులు ధరించాలని, గోరు వెచ్చని నీళ్లు తాగాలని చెబుతున్నారు. చేతులకు గౌజులు, పాదాలకు సాక్స్ వేసుకోవాలని, వైరస్ వ్యాప్తి చెందకుండా చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలున్న వారు ఇన్ హేలర్లను దగ్గర ఉంచుకోవాలని, బయటికి వెళితే మాస్క్ ధరించాలని స్పష్టం చేస్తున్నారు. చిన్నారులు, పెద్ద వయసువారు చలి సమయాల్లో బయటికి వెళ్లకపోవడం మంచిదని పేర్కొంటున్నారు.
మరింత పెరగనున్న చలి
రాష్ట్రంలో మరో మూడు నాలుగు రోజుల పాటు చలి తీవ్రత మరింతగా పెరుగుతుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు 8.5 డిగ్రీల నుంచి 12.5 డిగ్రీల మధ్య నమోదవుతాయని పేర్కొంది. చలి తీవ్రతకు సంబంధించి మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపునకు పడిపోవచ్చని హెచ్చరించింది. మిగతా అన్ని జిల్లాల్లో 10-12.5 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా, చలి తీవ్రతతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏజెన్సీ గ్రామాలు వణికిపోతున్నాయి. ఉదయం 9 గంటల వరకు కూడా పొగ మంచు కమ్ముకుంటోంది. మంగళవారం రాత్రి అత్యల్పంగా కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యూ)లో 10.2 డిగ్రీలు, లింగాపూర్‌లో 10.5, ఆదిలాబాద్ జిల్లా సాత్నాలలో 11.1, బోథ్ మండలం పొచ్చెరలో 11.2 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

చిన్నారులకు చలితో ప్రమాదం
ఉష్ణోగ్రతలు బాగా తగ్గితే నవజాత శిశువుల నుంచి ఐదేళ్లలోపు పిల్లలకు ఎక్కువ ప్రమాదం. ముఖ్యంగా నవజాత శిశువులకు హైపోథెర్మియా కారణంగా ప్రాణహాని తలెత్తవచ్చు. వారిని వెచ్చగా ఉంచాలి. చల్లటి వాతావరణంతో పిల్లల్లో ఫ్లూ, వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. ఆస్తమా ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. వైద్యుల సలహా మేరకు తగిన ఇన్‌హేలర్లు వాడాలి. డిసెంబరు నెలలో చికెన్ పాక్స్, మిజిల్స్ ఇన్ఫెక్షన్ల వ్యాప్తి పెరుగుతుంది. ముందు జాగ్రత్తగా పిల్లలకు టీకాలు ఇప్పించాలి.
- డాక్టర్ ఉషారాణి, ప్రభుత్వ బోధనాస్పత్రి సూపరింటెండెంట్, నాగర్‌కర్నూల్

‘చలి’ కేసులు పెరుగుతున్నాయి
చలి తీవ్రతతో జలుబు, దగ్గు, వైరల్ జ్వరాలతో వస్తున్నవారి సంఖ్య మూడు నాలుగు రోజులుగా పెరుగుతోంది. శ్వాసకోశ సమస్యలు పెరుగుతున్నాయి. దీర్ఘకాలిక వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.
- డాక్టర్ రాజీవ్, పల్మనాలజిస్టు, కామినేని ఆస్పత్రి, హైదరాబాద్