Share News

Cold Wave: గిన్నెధరిలో 6.9 డిగ్రీల ఉష్ణోగ్రత

ABN , Publish Date - Dec 26 , 2025 | 06:06 AM

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండలంలోని గిన్నెధరిలో గురువారం 6.9 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది.

Cold Wave: గిన్నెధరిలో 6.9 డిగ్రీల ఉష్ణోగ్రత

  • హైదరాబాద్‌ నగరం గజ.. గజ!

  • శేరిలింగపల్లిలో 9.8 డిగ్రీలు

  • నగరాన్ని వదలని చలి

  • దగ్గు, జలుబుతో అనారోగ్యం

  • బారిన పడుతున్న నగరవాసులు

ఆసిఫాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండలంలోని గిన్నెధరిలో గురువారం 6.9 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. సిర్పూర్‌(యు)లో 7, కెరమెరిలో 8.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు హైదరాబాద్‌ నగర వాసులు చలితో గజ.. గజలాడుతున్నారు. తెల్లవారు జామున ప్రధాన రహదారులను మంచు కప్పేయడంతో వాహనదారుల ప్రయాణాలు ప్రమాదకరంగా మారుతున్నాయి. గురువారం తెల్లవారు జామున శేరిలింగంపల్లిలో అత్యల్పంగా 9.8, మల్కాజిగిరిలో 10.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు చలి గాలుల తీవ్రత కొనసాగుతోంది. గత పదేళ్లలో ఈ తరహా క నిష్ఠ ఉష్ణోగ్రతలు డిసెంబరులో నమోదు కాలేదని అధికారులు చెబుతున్నారు. సాధారణంకంటే 4-6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో రెండు రోజుల పాటు అక్కడిక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు తక్కువగానే నమోదయ్యే అవకాశాలుంటాయని బేగంపేట వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే రెండు రోజుల పాటు ప్రధానంగా ఆకాశం నిర్మలంగా ఉండి, సాయంత్రం, రాత్రి పాక్షికంగా మేఘావృతమవుతుందని, ఉదయం వేళల్లో పొగమంచు కురిసే అవకాశముంటుందన్నారు. ఉపరితల గాలులు గంటకు 4-6 కిలోమీటర్ల వేగంతో ఈశాన్య దిశ నుంచి వీచే అవకాశాలుంటాయన్నారు. పది రోజులుగా గ్రేటర్‌లో నమోదవుతున్న అత్పల్ప ఉష్ణోగ్రతలతో నగర వాసులను అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. తెల్లవారు జామున నమోదవుతున్న 8-10 డిగ్రీల ఉష్ణోగ్రతలు, చలి గాలులతో చిన్నారులు, సీనియర్‌ సిటిజన్లు ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పులతో వైరల్‌ ఫీవర్ల బారిన పడుతున్నవారి సంఖ్య భారీగా పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. గురువారం శేరిలింగంపల్లిలో 9.8 డిగ్రీలు, మల్కాజిగిరిలో 10.3, రాజేంద్ర నగర్‌లో 11, అల్వాల్‌లో 11.1, చందానగర్‌లో 11.3, కుత్బుల్లాపూర్‌లో 11.3, సికింద్రాబాద్‌లో 11.4, గాజులరామారంలో 11.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Dec 26 , 2025 | 06:06 AM