Share News

Severe Cold: కొనసాగుతున్న చలి తీవ్రత

ABN , Publish Date - Dec 25 , 2025 | 04:52 AM

రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. మంగళవారం రాత్రి 14 జిల్లాల్లో సింగిల్‌ డిజిట్‌ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి....

Severe Cold: కొనసాగుతున్న చలి తీవ్రత

  • కోహీర్‌లో 6.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

హైదరాబాద్‌, కోహీర్‌, నర్సాపూర్‌, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. మంగళవారం రాత్రి 14 జిల్లాల్లో సింగిల్‌ డిజిట్‌ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లాను చలి వణికిస్తోంది. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా కోహీర్‌ ప్రాంతం చలికి కేంద్రబిందువుగా మారింది. డిసెంబరు 5వ తేదీ నుంచి ఇక్కడ నిరంతరాయంగా సింగిల్‌ డిజిట్‌ ఉష్ణోగ్రతలే నమోదవుతుండడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. బుధవారం ఉదయం కోహీర్‌లో 6.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా మెదక్‌ జిల్లాలోని దామరంచలో 9.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌లో 8.1, సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌లో 8.2, ఆదిలాబాద్‌ జిల్లా బోరాజ్‌లో 8.3, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కందువాడలో 8.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రాబోయే రెండు మూడు రోజుల పాటు తెలంగాణలో కొన్ని జిల్లాల్లో సాధారణంకంటే 3-4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

చలికి తట్టుకోలేక యాచకుడి మృతి

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో చలికి తట్టుకోలేక ఓ యాచకుడు చనిపోయినట్లు భావిస్తున్నారు. నర్సాపూర్‌ పట్టణశివారులోని నిర్మానుష్య ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి పడి ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది. వారు వెళ్లి చూడగా అప్పటికే చనిపోయి ఉన్నాడు. అతడి ఒంటిపై కేవలం డ్రాయర్‌ మాత్రమే ఉంది. యాచకుడిగా భావిస్తున్నామని, చలికి తట్టుకోలేక.. అనారోగ్యంతో చనిపోయి ఉంటాడని నర్సాపూర్‌ ఎస్‌ఐ రంజిత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు.

Updated Date - Dec 25 , 2025 | 04:52 AM