Cyber Loan Scam: కూలీలుగా వెళ్లి.. సైబర్ నేరగాళ్లుగా రాటుదేలి..
ABN , Publish Date - Nov 23 , 2025 | 07:06 AM
వెళ్లిందేమో కూలీ పనులకు! రాటుదేలిందేమో సైబర్ నేరాల్లో! పెద్దగా చదువుకోకున్నా మోసాలకు పాల్పడటంతో గట్టి నేర్పు సంపాదించారు.
కోల్‌కతాలో తర్ఫీదు పొందిన ఏడుగురు పాలమూరు యువకులు
ఆన్‌లైన్‌లో లోన్ కాల్ సెంటర్లు తెరిచి వెయ్యిమందికి టోకరా
3కోట్ల మేర దోపిడీ.. నిందితుల అరెస్టు
మహబూబ్‌నగర్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): వెళ్లిందేమో కూలీ పనులకు! రాటుదేలిందేమో సైబర్ నేరాల్లో! పెద్దగా చదువుకోకున్నా మోసాలకు పాల్పడటంతో గట్టి నేర్పు సంపాదించారు. ఆన్‌లైన్‌లో లోన్ కాల్ సెంటర్లు తెరిచి కేవలం ఏడాదిలో దాదాపు వెయ్యిమందిని ట్రాప్‌చేసినట్లు.. వారినుంచి రూ.3కోట్లు కాజేసినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇదంతా పాలమూరు జిల్లాకు చెందిన ఏడుగురు యువకుల మాయ! ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ జానకి వెల్లడించారు. మహబూబ్‌నగర్ రూరల్ మండలం తువ్వగడ్డ తండకు చెందిన యువకులు జర్పుల సురేందర్, కాట్రావత్ హనుమంతు, వాడ్త్య రాజా, వాడ్త్య భాస్కర్, కట్రావత్ నరేశ్, రాత్లావత్ సంతోష్, రాత్లావత్ సోమ్లా 2023లో ఉపాధి కోసం కోల్‌కతా వెళ్ళారు. అక్కడ సైబర్ ముఠాతో వీరికి పరిచయం ఏర్పడింది. ఆన్ లైన్‌లో సైబర్ నేరాలు ఎలాచేయాలో వారి వద్ద శిక్షణ తీసుకున్నారు. ఈ ఏడుగురు వారి వద్దే పనిచేసేవారు.. వారేమో అందుకు కమీషన్ ఇచ్చేవారు. ఈ డబ్బులు తమకు సరిపోవని భావించి.. పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించేందుకు ఈ ఏడుగురు అక్కడ పనిమానేశారు. 2024 చివర్లో స్వస్థలాలకు తిరిగొచ్చారు. ఆన్‌లైన్‌లో ధన, ఇండియా బుల్స్ లోన్‌కాల్ సెంటర్లు తెరిచారు. ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లో ప్రచారం చేసుకున్నారు. అవి చూసి రుణం పొందాలనుకునేవారు క్లిక్ చేస్తే.. ఆధార్, పాన్‌కార్డు అప్‌లోడ్ చేయించుకుంటారు. వెంటనే మీకు లోన్ మంజూరైందని చెప్పి, ఓ ఫేక్‌లోన్ లెటర్ పంపిస్తారు.
తరువాత కాల్ చేసి ప్రాసెసింగ్ ఫీజు, ఇన్సూరెన్స్. జీఎస్టీ, టీడీఎస్, మొదటి ఈఎంఐ అంటూ అందిన కాడికి డబ్బులు వేయించుకొని నంబర్ బ్లాక్ చేస్తారు. ఇలా వెయ్యి మంది నుంచి ఈ ముఠా ఏడాదిలో రూ. 3 కోట్ల వరకు కొట్టేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈనెల 19న నగరానికి చెందిన హన్మంతు అనే వ్యక్తి నుంచి రూ. 76,655 కాజేశారు. బాధితుడు టు టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు, సైబర్ పోలీసులు అంతాకలిసి లొకేషన్ ఆధారంగా నంబర్‌ను ట్రేస్ చేసి నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద సిమ్ కార్డులు, అకౌంట్‌లు చూసి పోలీసులకు మతిపోయింది. వెయ్యిమందిని మోసం చేసినట్లు అనుమానిస్తున్నా అంతకన్నా ఎక్కువ మందినే మోసం చేసి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారిని కస్టడికి తీసుకొని పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని ఎస్పీ వెల్లడించారు. నిందితుల నుంచి రూ. 1.50 లక్షల నగదు, ఆటో, బైక్, ల్యాప్‌టాప్, ఆండ్రాయిడ్ ఫోన్లు 2, కీప్యాడ్ ఫోన్లు 2, మొబైల్స్ 7 స్వాధీనం చేసుకున్నారు.