Share News

Surprise Inspections of Nursing Schools: నర్సింగ్‌ విద్య.. అంతా మిథ్యఛి

ABN , Publish Date - Oct 15 , 2025 | 04:00 AM

రాష్ట్రంలో నర్సింగ్‌ విద్య మిథ్యగా మారింది. పలు నర్సింగ్‌ కాలేజీలు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు...

Surprise Inspections of Nursing Schools: నర్సింగ్‌ విద్య.. అంతా మిథ్యఛి

  • చిరునామా ఒకచోట.. కాలేజీ మరోచోట.. ఒకే భవనంలో ఎక్కువ కాలేజీలు.. అనుబంధ ఆస్పత్రులు నిల్‌

  • 16 నర్సింగ్‌స్కూల్స్‌పై ఆకస్మిక తనిఖీలలో బయటపడ్డ లోపాలు

  • ప్రజల ఫిర్యాదులతో.. రాష్ట్రవ్యాప్త తనిఖీలకు వైద్య మంత్రి ఆదేశం

  • లోపాలున్న నర్సింగ్‌ విద్యాసంస్థలకు అండగా ఓ ఉన్నతాధికారి?

హైదరాబాద్‌, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నర్సింగ్‌ విద్య మిథ్యగా మారింది. పలు నర్సింగ్‌ కాలేజీలు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో.. వైద్యమంత్రి దామోదర రాజనర్సింహ తనిఖీలకు ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో మంగళవారం హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, నల్లగొండ జిల్లాల్లో పలు నర్సింగ్‌ స్కూల్స్‌, కాలేజీలపై నర్సింగ్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలోని బృందాలు తనిఖీలు చేశాయి. మొత్తం 23 నర్సింగ్‌స్కూల్స్‌పై సర్కారుకు ఫిర్యాదులు రాగా.. ఒక్కో నర్సింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌కూ ఇద్దరేసి చొప్పున మొత్తం 46 మంది అధికారులు తనిఖీలకు వెళ్లారని.. తొలి రోజు 16 నర్సింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో తనిఖీలు చేశారని సమాచారం. బుధ, గురువారాల్లో మరికొన్ని ఇన్‌స్టిట్యూట్లపై తనిఖీలు కొనసాగుతాయని వైద్యవర్గాలు పేర్కొన్నాయి.

ఇవీ ఫిర్యాదులు..

పలు నర్సింగ్‌ ఇన్‌స్టిట్యూట్లలో కనీస మౌలిక వసతుల్లేవని.. బోధన సిబ్బంది లేరని.. కొన్ని స్కూల్స్‌ చిరునామా రికార్డుల్లో ఒకచోట ఉంటే.. వాస్తవంగా మరోచోట ఉన్నాయని.. ఒకే భవనంలో ఎక్కువ నర్సింగ్‌ స్కూల్స్‌ ఉన్నాయని.. సర్కారుకు అందిన ఫిర్యాదుల సారాంశం. ఏయే ఇన్‌స్టిట్యూట్లు ఏయే నిబంధనలనుల్లంఘిస్తున్నాయనే విషయమై సర్కారుకు పేర్లతో సహా ఫిర్యాదులందాయి. దీంతో ప్రభు త్వ ఆదేశాల మేరకు.. వైద్యవిద్య సంచాలకుడు (అకడమిక్‌) తనిఖీలు చేయాలని నర్సింగ్‌ కౌన్సిల్‌ రిజిస్ట్రార్‌ను ఆదేశించారు. తనిఖీల్లో తమకందిన ఫిర్యాదు లు నిజమేనని.. పలు ఇన్‌స్టిట్యూట్లకు అనుబంధ ఆస్పత్రులు లేవని అధికారులు గుర్తించినట్టు సమాచారం. కనీస మౌలిక వసతులతోపాటు టీచింగ్‌ ఫ్యాకల్టీ కూడా ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌(ఐఎన్‌సీ) నిబంధనల మేరకు లేదని తేలింది. తనిఖీలు పూర్తిచేసి 1-2 రోజుల్లో సర్కారుకు నివేదిక అందిస్తామని.. నిబంధనలు పాటించని నర్సింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ల గుర్తింపును రద్దు చేయాలని ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ఓ ఉన్నతాధికారి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.


మూడేళ్లకొకమారు రెన్యువల్స్‌...

రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆధ్వర్యంలో జీఎన్‌ఎమ్‌, బీఎస్సీ నర్సింగ్‌ కాలేజీలు, ఇన్‌స్టిట్యూట్‌లు 424 ఉన్నాయి. వీటిలో ఎక్కువభాగం ప్రైవేటు సంస్థలే. నిబంధనల ప్రకారం.. ప్రభుత్వ గుర్తింపు పొందిన నర్సింగ్‌ విద్యాసంస్థల్లో మూడేళ్లకోసారి తనిఖీలు నిర్వహించి.. అన్నీ సవ్యంగా ఉంటేనే గుర్తింపు రె న్యువల్‌ చేస్తారు. మౌలిక వసతులు, క్లినికల్‌ ట్రైనింగ్‌ఎక్కడ పొందుతున్నారు? హాస్టల్‌, బస్సు సౌకర్యం, టీచింగ్‌ ఫ్యాకల్టీ తదితర వసతులున్నాయా ? లేదా? అకడమిక్‌ గ్రోత్‌ ఎలా ఉంది? ఈ అంశాలన్నీ పరిశీలించాకే రెన్యువల్‌ చేస్తారు. రెన్యువల్స్‌ కోసం చేసే తనిఖీల్లోనే గోల్‌మాల్‌ జరుగుతోందన్న ఆరోపణలు న్నాయి. పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతుండటంతో అవన్నీ సక్రమంగా ఉన్నాయని నివేదికల తో, వాటికి రెన్యువల్స్‌ రావడం ఆనవాయితీగా మా రింది. లోపాలున్న నర్సింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌కు ఓ ఉన్నతాధికారి అండగా నిలుస్తున్నారనే ఆరోపణలున్నం దునే ఎన్ని లోపాలున్నా.. ఎన్నో ఏళ్లుగా ఆ నర్సింగ్‌ విద్యాసంస్థలు నడుస్తున్నాయనే విమర్శలున్నాయి.

Updated Date - Oct 15 , 2025 | 04:00 AM