Investment Scam: ఆర్థిక మోసగాళ్ల వలలో ఐఏఎస్‌లు.. ఐపీఎ్‌సలు!
ABN , Publish Date - Sep 17 , 2025 | 05:45 AM
ఆర్థిక మోసగాళ్లు రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. ప్రీ లాంచ్ ఆఫర్, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు, తమ వెంచర్‌లో పెట్టుబడులు పెడితే ప్రతి నెలా 15 శాతం రిటర్నులు ఇస్తామని, బంగారంపై పెట్టుబడి పెడితే ఏడాదిలో....
ప్రైవేటు సంస్థల్లో రూ.కోట్లలో కొందరి పెట్టుబడి.. బినామీల పేరుతో పెట్టుబడి పెట్టిన అధికారులు
తమ గార్మెంట్ ఫ్యాక్టరీలో పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించి కోట్లు కొల్లగొట్టిన మహిళ
సీసీఎ్‌సలో కేసు నమోదు.. మహిళ అరెస్టు?.. అన్ని కోట్లు వారికెలా వచ్చాయనే కోణంలో దర్యాప్తు
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక మోసగాళ్లు రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. ప్రీ లాంచ్ ఆఫర్, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు, తమ వెంచర్‌లో పెట్టుబడులు పెడితే ప్రతి నెలా 15 శాతం రిటర్నులు ఇస్తామని, బంగారంపై పెట్టుబడి పెడితే ఏడాదిలో డబుల్ రేటుతో బంగారం పొందవచ్చని, తమ కంపెనీలో, ఫ్యాక్టరీలో పెట్టుబడులు పెడితే అధిక మొత్తంలో లాభాలు ఇస్తామని.. ఇలా కల్లబొల్లి మాటలతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. రూ.వందల కోట్లు మూటగట్టుకొని బిచాణా ఎత్తేస్తున్నారు. ఈ కేటుగాళ్ల వలలో కొందరు ఐఏఎ్‌సలు, ఐపీఎ్‌సలు కూడా చిక్కుకొని మోసపోయినట్లు తెలుస్తోంది. అయితే వీరిని ఇలా మోసం చేసింది ఓ మహిళ కావడం గమనార్హం. తన గార్మెంట్ సంస్థలో పెట్టుబడులు పెడితే అఽధిక లాభాలు వస్తాయని చెప్పి.. పదుల సంఖ్యలో వ్యక్తులతో పెట్టుబడులు పెట్టించి రూ.కోట్లు కొల్లగొట్టినట్లు తెలిసింది. పెట్టుబడులు పెట్టిన వారిలో ఓ ఐఏఎస్, ఆర్డీవోలు సహా.. పలువురు రెవెన్యూ, ఇతర ఉన్నతాధికారులు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. వారంతా అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించిన సొమ్మును బినామీల పేరుతో పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది. కలెక్టర్ సహా.. పెద్ద పెద్ద అధికారులతో పరిచయాలు ఉన్న సదరు మహిళ.. తమకు వివిధ గార్మెంట్ ఫ్యాక్టరీల్లో భాగస్వామ్యం ఉందని, వివిధ నగరాలు, పట్టణాలకు లక్షల సంఖ్యలో స్కూలు యూనిఫామ్‌లు సరఫరా చేస్తున్నామని నమ్మబలికింది. తమ సంస్థలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని చెప్పింది. నకిలీ ఇన్వాయి్‌సలు చూపించింది. అంతా నిజమని నమ్మి పలువురు పెట్టుబడులు పెట్టారు. కొంతకాలం క్రితం శివారు జిల్లాకు కలెక్టర్‌గా పనిచేసి సంచలనం సృష్టించిన ఐఏఎస్ అధికారి సహా.. పలువురు అధికారులు బినామీల పేరుతో రూ.కోట్లలో పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది. అలా రూ.70 కోట్ల వరకు వసూలు చేసిన మహిళ ఆ తర్వాత బిచాణా ఎత్తివేసినట్లు సమాచారం. దాంతో వారిలో కొంతమంది సైబరాబాద్ పోలీసులను, ఆపై సీసీఎస్ పోలీసులను ఆశ్రయించగా.. ఇటీవల కేసు నమోదు చేసి ఆ మహిళను అరెస్టు చేసినట్లు తెలిసింది.
అంత డబ్బు వారికి ఎలా వచ్చింది?
నిందితురాలిని అరెస్టు చేసిన పోలీసులు మరోసారి కస్టడీకి తీసుకున్నట్లు తెలిసింది. ఆమె వద్ద పెట్టుబడులు పెట్టిన వారిలో ఉన్నతాధికారులకు చెందిన బినామీలు ఉన్నట్లు గుర్తించి.. వారిని విచారిస్తున్నట్లు సమాచారం. రూ. కోట్లలో పెట్టుబడులు పెట్టేంత డబ్బు వారికి ఎలా వచ్చింది? వారి వెనుక ఉన్న పెద్దవాళ్లు ఎవరు? అనే కోణంలో సమాచారం రాబడుతున్నట్లు తెలిసింది. అంతేకాకుండా.. రూ.70 కోట్ల దాకా ఆర్థిక మోసానికి పాల్పడిన మహిళ.. ఆ డబ్బును ఏం చేసిందనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పెట్టుబడులు పెట్టిన పలువురు ఉన్నతాఽధికారులు తమ పలుకుబడిని ఉపయోగించి ఆమె వద్ద డబ్బులను సెటిల్ చేసుకొని వసూలు చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో వారు ఎంత మొత్తంలో పెట్టుబడులు పెట్టారు? ఎంత వసూలు చేసుకున్నారు? అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం. మరోవైపు కొంతమంది యువ ఐపీఎస్ అధికారులు కూడా రియల్ ఎస్టేట్, విదేశాల్లో ఉన్న సంస్థల్లో పెట్టుబడులు పెట్టి రూ.కోట్లలో మోసపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఐపీఎ్‌సలతో అంటకాగిన కొంతమంది రియల్టర్ పెట్టుబడులు పెట్టించినట్లు సమాచారం. ఆ తర్వాత వాటాల్లో తేడాలు రావడంతో.. తమ డబ్బు రాబట్టుకోవడానికి ఐపీఎ్‌సలు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.