Secret Alprazolam Factory: బడిలో మత్తుమందు తయారీ!
ABN , Publish Date - Sep 14 , 2025 | 04:44 AM
అది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే పాఠశాల.. నర్సరీ నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు చదువుతున్నారు..
ఓల్డ్ బోయిన్‌పల్లి మేధ పాఠశాలలోనిరెండు గదుల్లో అల్ర్పాజోలం ఫ్యాక్టరీ
కల్లు దుకాణాలకు సరఫరా
పక్కా సమాచారంతో ఈగిల్ దాడి
ఏడు కిలోల అల్ర్పాజోలం పట్టివేత
హైదరాబాద్ సిటీ/ బోయినపల్లి, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): అది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే పాఠశాల.. నర్సరీ నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు చదువుతున్నారు.. కానీ అదే భవనంలోని రెండు గదుల్లో రహస్యంగా అల్ర్పాజోలం మత్తుమందు తయారవుతోంది.. పలు ప్రాంతాల్లోని కల్లు కాంపౌండ్లకు, ఇతర దుకాణాలకు సరఫరా అవుతోంది. సదరు పాఠశాల నిర్వాహకుడే అడ్డదారిలో డబ్బు సంపాదించేందుకు ఈ దందాకు తెరతీశారు. శనివారం ఈగిల్ (నార్కోటిక్) బృందం ఆ పాఠశాలపై దాడి చేసి, గుట్టు రట్టు చేసింది. హైదరాబాద్‌లోని ఓల్డ్ బోయినపల్లిలో మల్లెల జయప్రకాశ్‌గౌడ్ మేధ పాఠశాలను నిర్వహిస్తున్నారు. అందులో కొంత గ్రౌండ్ ఫ్లోర్, ఒకటో అంతస్తులో తరగతి గదులు ఉన్నాయి. రెండో అంతస్తులో ఆఫీస్ రూమ్ ఉంది. అయితే జయప్రకాశ్‌గౌడ్‌కు తనకు తెలిసిన శేఖర్ అనే వ్యక్తి ద్వారా ఏడాది క్రితం గురువారెడ్డి పరిచయం అయ్యారు. తన వద్ద అల్ర్పాజోలం తయారీ ఫార్ములా ఉందని, కోట్లు సంపాదించవచ్చని గురువారెడ్డి చెప్పారు. ఆ ఫార్ములా, తయారీ పద్ధతి తెలుసుకున్న జయప్రకాశ్.. పాఠశాల రెండో అంతస్తులో ఆఫీసు పక్కన రెండు గదుల్లో మినీ ఫ్యాక్టరీ పెట్టి అల్ర్పాజోలం తయారుచేస్తున్నారు. మహబూబ్‌నగర్‌లోని బూత్పూర్‌తోపాటు పలు ప్రాం తాల్లోకి కల్లు కాంపౌండ్లకు, కల్లు విక్రేతలకు దానిని సరఫరా చేస్తున్నారు. దీనిపై సమాచారం అందిన ఈగిల్ బృందం శనివారం దాడి చేసింది. తయారు చేసి సిద్ధంగా ఉంచిన అల్ర్పాజోలం 3.5 కిలోలు, తయారీ ప్రక్రియ చివరిలో ఉన్న అల్ర్పాజోలం 4.3 కిలోలు, అల్ర్పాజోలం తయారీ పరికరాలు, ముడి పదార్థాలు, మాత్రలతోపాటు రూ.21 లక్షల నగదును స్వాధీనం చేసుకుంది. జయప్రకాశ్‌గౌడ్‌తోపాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుంది. ముడి పదార్థాలు ఎక్కడి నుంచి తెస్తున్నారు? తయా రు చేసిన అల్ర్పాజోలంను ఎవరెవరికి అమ్మారు? ఇందులో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందన్న అంశాలపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.