Share News

Second Phase of Panchayat Elections: రెండో విడత పంచాయతీ రేపే!

ABN , Publish Date - Dec 13 , 2025 | 05:34 AM

రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం సాయంత్రమే ప్రచార పర్వం ముగిసింది....

Second Phase of Panchayat Elections: రెండో విడత పంచాయతీ రేపే!

  • శుక్రవారం సాయంత్రం ముగిసిన ప్రచారం.. మొత్తం 4,332 సర్పంచ్‌ స్థానాలు.. 415 ఏకగ్రీవం’’

  • 8 5 చోట్ల నిలిచిన ఎన్నిక.. 3,911 స్థానాలకు పోలింగ్‌

హైదరాబాద్‌, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం సాయంత్రమే ప్రచార పర్వం ముగిసింది. ఆదివారం (14న) ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ జరుగుతుంది. 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి, ఫలితాలను వెల్లడిస్తారు. ఆ వెంటనే ఉప సర్పంచ్‌ ఎన్నికను కూడా పూర్తి చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. రెండో విడతలో మొత్తం 4,332 సర్పంచ్‌ స్థానాలకుగాను 415 చోట్ల ఏకగ్రీవమయ్యాయి. రిజర్వేషన్లు, ఇతర కారణాలతో 5 గ్రామాల్లో ఒక్క నామినేషన్‌ కూడా రాలేదు. దాంతో 3,911 సర్పంచ్‌ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 13,128 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక రెండో విడతలో 38,342 వార్డుసభ్యుల స్థానాలు ఉండగా, 8,304 సీట్లు ఏకగ్రీవమయ్యాయి. 107 వార్డుల్లో నామినేషన్లు రాలేదు. దీనితో 29,903 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా, 78,158 మంది బరిలో ఉన్నారు. మొత్తంగా 57,22,565 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్‌కు ముందు అంటే శనివారమే సిబ్బంది ఆయా పోలింగ్‌ కేంద్రాలకు చేరుకునేలా అధికారులు ఏర్పాట్లుచేశారు.


ఉమ్మడి ఖమ్మం.. కాంగ్రెస్‌ అడ్డా..

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి పూర్తి మద్దతుగా నిలిచిన ఉమ్మడి ఖమ్మం జిల్లా.. ఇప్పుడు తొలి విడత పంచాయతీ ఫలితాల్లోనూ కాంగ్రె్‌సకే జైకొట్టింది. ఉమ్మడి జిల్లాలో 351 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే.. 223 సర్పంచ్‌ పదవులను కాంగ్రెస్‌ మద్దతుదారులే కైవసం చేసుకున్నారు. బీఆర్‌ఎస్‌ వారు 73 చోట్ల, వామపక్షాలు, టీడీపీ, స్వతంత్ర అభ్యర్థులు కలిపి 55 చోట్ల విజయం సాధించారు. బీజేపీ మద్దతుదారులు ఒక్కరు కూడా గెలవలేదు. ఇక రాష్ట్రంలోనే పెద్ద పంచాయతీ అయిన భద్రాచలం సర్పంచ్‌గా కాంగ్రెస్‌ బలపర్చిన పూనెం కృష్ణ విజయం సాధించారు. ఇక్కడ మొత్తం 40,768 ఓట్లకుగాను 19,838 ఓట్లు పోలవగా.. గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు లెక్కింపు జరిగింది.

ఓటు.. అటూ, ఇటూ..

ఖమ్మం జల్లా మధిర మండలం వంగవీడు పంచాయతీలో ఓట్ల లెక్కింపు గందరగోళం రేపింది. మొదట బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి దొండపాటి నాగమణి 3 ఓట్లతో గెలిచినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. రీకౌంటింగ్‌లో 2 ఓట్ల మెజారిటీయే వచ్చినట్టు తెలిపారు. ఇతర అభ్యర్థుల డిమాండ్‌తో మళ్లీ రీకౌంటింగ్‌ చేసి కాంగ్రెస్‌ మద్దతుదారు సిద్దిపోగు ప్రసాద్‌ 4 ఓట్లతో గెలిచినట్టు ప్రకటించారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తానని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రకటించారు.

కేసీఆర్‌ ఇలాఖాలో గట్టిపోటీ..

మాజీ సీఎం కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు దీటుగా కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. గత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు అభ్యర్థులే కరువైన పరిస్థితి ఉంది. కానీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు గట్టిపోటీనిచ్చారు. గజ్వేల్‌ నియోజకవర్గంలోని 119 గ్రామాల్లో 53 సర్పంచ్‌ స్థానాలు బీఆర్‌ఎస్‌, 44 గ్రామాల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు సత్తాచాటారు. దాదాపు ఏడేళ్ల క్రితం జరిగిన పంచాయుతీ ఎన్నికల్లో 90 శాతం బీఆర్‌ఎస్‌ మద్దతుదారులే గెలుపొందగా .. తాజా ఎన్నికల్లో మాత్రం నువ్వానేనా అన్నట్లుగా పోటీ జరిగింది.

  • బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్‌ లోక్‌సభ స్థానం పరిధిలో తొలి విడతలో 360 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. అందులో బీజేపీ మద్దతుదారులు గెలిచినవి 13 మాత్రమే. సుమారు 200 పంచాయతీల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు, 130 చోట్ల బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు గెలుపొందారు.

పోస్టల్‌ బ్యాలెట్‌.. గెలిపించింది!

వికారాబాద్‌ జిల్లా పెద్దేముల్‌ మండలం గిర్మాపూర్‌లో సంధ్యానాయక్‌కు 190 ఓట్లు, శివరాం నాయక్‌కు 189 ఓట్లు వచ్చాయి. అయితే ఇక్కడ పోలైన రెండు పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్లు శివరాం నాయక్‌కు పడటంతో ఆయన ఒక్క ఓటు మెజారిటీతో సర్పంచ్‌గా గెలుపొందారు. ఇక రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొండారెడ్డిపల్లిలో కాంగ్రెస్‌ మద్దతుదారు పల్లె ఆనంద్‌కుమార్‌కు, బీఆర్‌ఎస్‌ మద్దతుదారు ప్రేమ్‌కుమార్‌కు చెరో 793 ఓట్లు వచ్చాయి. అయితే ఆనంద్‌కుమార్‌కు 3 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు రావడంతో సర్పంచ్‌ పదవి వరించింది.

Updated Date - Dec 13 , 2025 | 05:34 AM