Share News

Panchayat Election Schedule: నేడు రెండో విడత పంచాయతీ పోరు

ABN , Publish Date - Dec 14 , 2025 | 06:16 AM

రాష్ట్రంలోని రెండో విడుత పంచాయతీ ఎన్నికలు ఆదివారం జరుగనున్నాయి. పోలింగ్‌ నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.

Panchayat Election Schedule: నేడు రెండో విడత పంచాయతీ పోరు

  • 3,911 పంచాయతీల్లో..

  • బరిలో 13,128 మంది

  • ఉదయం 7 నుంచి పోలింగ్‌

  • ఊరికి రండి.. ఓటేయండి!

  • నగరాల్లోని ఓటర్లకు విజ్ఞప్తులు

  • ఖర్చులతోపాటు వాహనాలు ఏర్పాటు చేస్తున్న అభ్యర్థులు

హైదరాబాద్‌/భువనగిరి రూరల్‌, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని రెండో విడుత పంచాయతీ ఎన్నికలు ఆదివారం జరుగనున్నాయి. పోలింగ్‌ నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. షెడ్యూల్‌ ప్రకారం రెండో విడుతలో మొత్తం 4,332 సర్పంచ్‌ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, 415 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. రిజర్వేషన్లు, ఇతర సమస్యలతో 6 గ్రామాల్లో ఎన్నికలు జరగటం లేదు. దీంతో ఆదివారం 3,911 సర్పంచ్‌ స్థానాలకు పోలింగ్‌ జరుగనుంది. బరిలో 13,128 మంది అభ్యర్థులు నిలిచారు. ఈ విడతలో 38,342 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 8,304 స్థానాలు ఏకగీవ్రం అయ్యాయి. 107 వార్డు స్థానాల్లో నామినేషన్లు వేయలేదు. దీంతో 29,903 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ స్థానాల్లో 78,158 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ దఫాలో 57,22,565 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 193 మండలాల్లో జరిగే రెండో విడత ఎన్నికల కోసం 38,337 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్‌ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కించి, ఫలితాలను ప్రకటిస్తారు. సాయంత్రం ఉప సర్పంచ్‌ ఎన్నికలు నిర్వహిస్తారు.కాగా, యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బస్వాపురంలో 9వ వార్డులో పోటీలో ఉన్న వనగంటి లక్ష్మి (42) శనివారం ఉదయం మరణించారు. అయినప్పటికీ ఆదివారం యథావిధిగా ఆ వార్డులో ఎన్నికలు నిర్వహిస్తామని తహసీల్దార్‌ ఎన్‌.అంజిరెడ్డి తెలిపారు.

Updated Date - Dec 14 , 2025 | 06:17 AM