SCCL Gets License for Gold: సింగరేణికి బంగారం, రాగి అన్వేషణ లైసెన్సు
ABN , Publish Date - Sep 17 , 2025 | 05:37 AM
సింగరేణి సంస్థ కర్ణాటకలోని దేవదుర్గ ప్రాంతంలో బంగారం, రాగి ఖనిజాల అన్వేషణకు లైసెన్సు పొందింది. ఈ లైసెన్సును కేంద్ర బొగ్గు గనుల శాఖ.....
సింగరేణి సీఎండీకి అందజేసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్/గోదావరిఖని, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): సింగరేణి సంస్థ కర్ణాటకలోని దేవదుర్గ ప్రాంతంలో బంగారం, రాగి ఖనిజాల అన్వేషణకు లైసెన్సు పొందింది. ఈ లైసెన్సును కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్‌కు అందించారు. గత మార్చి నెలలో జరిగిన కీలక ఖనిజాల వేలంలో 37.75 శాతం రాయల్టీతో 199 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గల ఈ అన్వేషణ పనిని సింగరేణి దక్కించుకుంది. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ శాఖ డైరెక్టర్ వల్లూరు క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
కోల్ ఇండియా ఉద్యోగులకు రూ.1 కోటి ప్రమాద బీమా
న్యూఢిల్లీ: కోల్ ఇండియా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి మంగళవారం కొత్త కార్పొరేట్ శాలరీ ప్యాకేజీని ప్రారంభించారు. దీనిలో భాగంగా కోల్ ఇండియాలోని రెగ్యులర్ ఉద్యోగులకు రూ.1 కోటి వ్యక్తిగత ప్రమాద బీమాను, కాంట్రాక్టు కార్మికులకు రూ. 40 లక్షల బీమా కవరేజిని ప్రకటించారు. ఈ పథకానికి ఉద్యోగులు ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. దీనిని 10 ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఛత్తీ్‌సగఢ్ స్టేట్ గ్రామీణ బ్యాంకుతో కుదిరిన ఒప్పందం ద్వారా అమలు చేస్తున్నారు. ఈ ప్యాకేజీలో భాగంగా, మైనింగ్ ప్రమాదాల్లో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఇచ్చే ఎక్స్-గ్రేషియా మొత్తాన్ని కూడా పెంచారు. ఇంతకుముందు రూ.15 లక్షలుగా ఉన్న ఈ పరిహారాన్ని ఇప్పుడు రూ. 25 లక్షలకు పెంచారు.