SC Hostel Warden Suspended: భూపాలపల్లి ఎస్సీ హాస్టల్ వార్డెన్ సస్పెన్షన్
ABN , Publish Date - Dec 31 , 2025 | 05:12 AM
భూపాలపల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న ఎస్పీ హాస్టల్‌లో బాలికను వార్డెన్ భవాని విచక్షణా రహితంగా కొట్టడాన్ని కలెక్టర్ రాహుల్ శర్మ తీవ్రంగా పరిగణించారు
విచారణకు ప్రత్యేక అధికారి.. కలెక్టర్ వెల్లడి
రాత్రిపూట హాస్టల్‌లోకి ప్రవేశించిన ఆగంతకుడు
భయంతో డయల్ 100కు ఫోన్ చేసిన బాలికలు
వార్డెన్ సీరియస్.. ఓ బాలికను చితకబాదిన వైనం
భూపాలపల్లిటౌన్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): భూపాలపల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న ఎస్పీ హాస్టల్‌లో బాలికను వార్డెన్ భవాని విచక్షణా రహితంగా కొట్టడాన్ని కలెక్టర్ రాహుల్ శర్మ తీవ్రంగా పరిగణించారు. ఆ వార్డెన్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఎస్సీ హాస్టల్‌లోకి గుర్తు తెలియని వ్యక్తి వచ్చి వెళ్లినట్లు ఆరోపణలొచ్చాయి. ఈ క్రమంలోనే వార్డెన్ భవాని ఓ విద్యార్థినిపై చేయి చేసుకున్న తాలూకు వీడియో వైరల్ అయింది. కలెక్టర్ మంగళవారం హాస్టల్‌కొచ్చి విచారణ చేపట్టారు. విద్యార్థినులతో మాట్లాడారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి వార్డెన్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇందుకు సంక్షేమ అధికారిని ప్రత్యేక విచారణ అధికారిగా నియమించామని తెలిపారు. హాస్టల్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని భరోసా ఇచ్చారు.
అసలేం జరిగింది?
డిసెంబరు 18న రాత్రి హాస్టల్‌లోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించాడనే వార్త చర్చనీయాంశమైంది. అతడు ఓ గదిలోకి వెళ్లడాన్ని పలువురు విద్యార్థినులు చూశారు. ఆందోళనకు గురై 100కు ఫోన్ చేశారు. కొద్దిసేపటికి ఇద్దరు పోలీసులు హాస్టల్ వద్దకొచ్చారు. ఆ ఆగంతకుడు తన ఇద్దరు మిత్రులకు ఫోన్‌చేయడంతో వారు కారులో అక్కడికొచ్చారు. ఆ ముగ్గురూ పోలీసులను మేనేజ్ చేసి వారిని పంపించేశారు. కొద్దిసేపటికి వారు కూడా కారులో వెళ్లిపోయారు. ఇదంతా సీసీ పుటేజీ ద్వారా లీక్ అయింది. ఓ విద్యార్థి సంఘం నాయకుడు ఆ కారును, ఇద్దరు వ్యక్తులను తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఫలితంగా ఈ విషయం బయటకు పొక్కింది. కాగా సదరు ఇద్దరు వ్యక్తులు హాస్టల్‌లోకి వచ్చిన ఆగంతకుడిని కాపాడేందుకే అక్కడికి వచ్చారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కాగా హాస్టల్‌లోకి ఆగంతకుడు హాస్టల్లోకి వచ్చిన విషయాన్ని డయల్ 100 ద్వారా బాలికలు పోలీసులకు చెప్పడం వార్డెన్‌కు నచ్చలేదు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని వారిని ఆమె హెచ్చరించింది. అయితే ఆ రోజు ఆగంతకుడిని నేరుగా చూసినా ఓ బాలిక నాలుగు రోజుల తర్వాత పనిమీద బయటకు వెళ్లి సాయంత్రం ఆలస్యంగా తిరిగొచ్చింది. ఇది తెలిసి.. ఆ బాలికను పిలిపించుకున్న వార్డెన్ ఆమెను ఇష్టంవచ్చినట్లు బూతులు తిడుతూ కొట్టింది. ఈ దృశ్యాన్ని మరో విద్యార్థిని వీడియో తీసి 28న వైరల్ చేశారు.