Share News

Sarfaraz Ahmed Appointed: మెట్రో ఎండీగా సర్ఫరాజ్‌ అహ్మద్‌

ABN , Publish Date - Sep 17 , 2025 | 05:47 AM

హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎండీగా ఐఏఎస్‌ అధికారి సర్ఫరాజ్‌ అహ్మద్‌ నియమితులయ్యారు. హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా ఉన్న ఆయనకు ప్రభుత్వం మెట్రో..

Sarfaraz Ahmed Appointed: మెట్రో ఎండీగా సర్ఫరాజ్‌ అహ్మద్‌

  • ప్రభుత్వ సలహాదారుగా ఎన్వీఎస్‌ రెడ్డి నియామకం

  • ఆయనకు పట్టణ రవాణా వ్యవస్థ అప్పగించిన సర్కార్‌

  • మహిళా శిశు సంక్షేమం డైరెక్టర్‌గా శృతి ఓఝా

  • పలువురు ఐఏఎ్‌సలకు అదనపు బాధ్యతలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎండీగా ఐఏఎస్‌ అధికారి సర్ఫరాజ్‌ అహ్మద్‌ నియమితులయ్యారు. హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా ఉన్న ఆయనకు ప్రభుత్వం మెట్రో ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇప్పటి వరకూ మెట్రో ఎండీగా ఉన్న ఎన్వీఎస్‌ రెడ్డిని ఆ బాధ్యతల నుంచి తప్పించి ప్రభుత్వ సలహాదారు (అర్బన్‌ ట్రాన్స్‌పోర్ట్‌)గా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇండియన్‌ రైల్వే అకౌంట్స్‌ సర్వీసెస్‌ (ఐఆర్‌ఏఎస్‌) అధికారి అయిన ఎన్వీఎస్‌ రెడ్డి 2017లో పదవీ విరమణ చేశారు. అయినా.. మెట్రో రైలు ఎండీగా ప్రభుత్వాలు ఆయన సర్వీసును పలుమార్లు పొడిగిస్తూ వచ్చాయి. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 వరకు ఆయన మెట్రో రైలు ఎండీగా కొనసాగాల్సి ఉంది. కానీ.. ప్రభుత్వం ఆయనను ఆ పోస్టు నుంచి రిలీవ్‌ చేసి, పట్టణ రవాణా వ్యవస్థ సలహాదారుగా నియమించింది. ఇక, రాష్ట్రంలోని ముగ్గురు ఐఏఎ్‌సలకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. స్టడీ లీవ్‌ నుంచి తిరిగి వచ్చిన శృతి ఓఝాకు పోస్టింగ్‌ ఇచ్చింది. ఆమెను మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా నియమించింది. ఇక, ఇంటర్మీడియట్‌ విద్య సంచాలకులు కృష్ణ ఆదిత్యకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. హెచ్‌ఎండీఏ జాయిం ట్‌ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ కోట శ్రీవత్సకు హెచ్‌ఎండీఏ (జనరల్‌) జాయింట్‌ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌గా, హెచ్‌ఎండీఏ సెక్రటరీగా అదనపు బాధ్యతలు అప్పగించింది.

నాన్‌-కేడర్‌ అధికారుల బదిలీలు

పలువురు నాన్‌-కేడర్‌ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్‌ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. పౌర సరఫరాల శాఖలో జనరల్‌ మేనేజర్‌గా డిప్యూటేషన్‌పై పని చేస్తున్న సహకార శాఖ జాయింట్‌ రిజిస్ట్రార్‌ ఎం.రాజిరెడ్డిని బదిలీ చేసి, చీఫ్‌ రేషనింగ్‌ ఆఫీసర్‌గా నియమించింది. ఆదిలాబాద్‌ జడ్పీ సీఈవో జి.జితేందర్‌రెడ్డిని బదిలీ చేసి, తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌ ఎండీగా పోస్టింగ్‌ ఇచ్చింది. కరీంనగర్‌ హౌజింగ్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ రాజేశ్వర్‌ను బదిలీ చేసి, ఆదిలాబాద్‌ అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు)గా నియమించింది.

Updated Date - Sep 17 , 2025 | 05:47 AM