Union Minister Bandi Sanjay: భారత సంస్కృతికి ప్రతిరూపం హిందీ
ABN , Publish Date - Sep 15 , 2025 | 05:19 AM
హిందీ ఒక భాష మాత్రమే కాదు. కోట్లాది మంది భారతీయుల భావోద్వేగాలు, సంస్కృతికి ప్రతిరూపం’ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు..
హైదరాబాద్, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ‘హిందీ ఒక భాష మాత్రమే కాదు. కోట్లాది మంది భారతీయుల భావోద్వేగాలు, సంస్కృతికి ప్రతిరూపం’ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. హిందీ రాజ భాష కావడంతో ప్రభుత్వ విభాగాల్లో సమన్వయం వచ్చిందన్నారు. విదేశాల్లో కూడా కోట్లాది మంది హిందీ మాట్లాడుతున్నారని, ఐక్యరాజ్య సమితి వంటి వేదికలపై ఈ భాషకు వచ్చిన అంగీకారం, భారతదేశ సాంస్కృతిక శక్తికి ప్రతీక అని వ్యాఖ్యానించారు. ‘హిందీ దివ్‌స’ను పురస్కరించుకుని ఆదివారం అహ్మదాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో పాటు సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘భాష అనేది కేవలం సంభాషణ సాధనం కాదు. అది మన సంస్కృతి, సంప్రదాయాల సంరక్షకురాలు. ఆత్మనిర్భర భారతావనికి అతి పెద్ద శక్తి దాని స్థానిక, మాతృభాషలే. మాతృ భాష మన హృదయానికి అత్యంత చేరువైనది. విదేశీ భాషలు మన జ్ఞానం, అవకాశాలను విస్తరిస్తాయి. ప్రతి భాషను సంరక్షించడం, గౌరవించడం మన కర్తవ్యం’ అని అన్నారు.