ఇసుక మాఫియా ఇష్టారాజ్యం
ABN , Publish Date - Aug 07 , 2025 | 12:20 AM
ఇసుక తవ్వకాలతో కనగల్ వాగు బ్రిడ్జికి ముప్పు పొంచి ఉంది. బ్రిడ్జి పిల్లర్ల వద్ద యంత్రాల సాయంతో రాత్రిబవళ్లు ఇసుక తోడుతు న్నారు. దీంతో బ్రిడ్జి కింద భారీ గోతులు ఏర్పడి బ్రిడ్జికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది.
కనగల్ వాగు బ్రిడ్జి కింద ఇసుక తవ్వకాలు
వాగుకు వరదొస్తే బ్రిడ్జి కుంగి కూలిపోయే ప్రమాదం
కనగల్, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): ఇసుక తవ్వకాలతో కనగల్ వాగు బ్రిడ్జికి ముప్పు పొంచి ఉంది. బ్రిడ్జి పిల్లర్ల వద్ద యంత్రాల సాయంతో రాత్రిబవళ్లు ఇసుక తోడుతు న్నారు. దీంతో బ్రిడ్జి కింద భారీ గోతులు ఏర్పడి బ్రిడ్జికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. దేవరకొండ-నల్లగొండ ప్రధాన రోడ్డుమార్గంలో ఈ బ్రిడ్జి కీలకంగా ఉండగా నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇసుక తవ్వకాలతో 2006-07 ప్రాంతంలో నిజాం కాలం నాటి పాత బ్రిడ్జి కుంగిపోయి కూలడంతో ఏళ్ల తరబడి రాకపోకలు నిలిచాయి. కొత్త బ్రిడ్జి నిర్మాణం జరిగే వరకు వాగు దారిలోనే ప్రయాణం చేస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత పరిమాణాలను అధికారులు దృష్టితో ఉంచుకోకుండా వాగు బ్రిడ్జి వద్ద ఇసుక తవ్వకాలను చూసీ చూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలున్నాయి. కనగల్ వాగులో ఇసుక రీచ్‌కు అనుమతులు ఇచ్చిన మైనింగ్ అధికారులు బ్రిడ్జి వద్ద ఇసుక తవ్వకాలు జరగకుండా చేయాలని ప్రజలు కోరుతున్నారు. రెవెన్యూ, పోలీసు, మైనింగ్ ఆయా శాఖల మద్య సమన్వయం లేదని, ఇసుక తవ్వకాలపై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. బ్రిడ్జికి అటు ఇటూ 500 మీటర్ల దూరంలో ఇసుక తవ్వకాలు చేపట్టాల్సి ఉండగా ఇవేమీ పట్టనట్లు ఇసుక వ్యాపారులు తవ్వకాలు చేస్తుండటంతో బ్రిడ్జికి ముప్పు వాటిల్లడమే కాక, భూగర్బ జలాలు అడుగంటి వ్యవసాయ బోర్లు వట్టిపోతున్నాయని కనగల్ గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా బోయినపల్లి బ్రిడ్జికి ఇసుక అక్రమ తవ్వకాలతో ముప్పు పొంచి ఉందని గ్రామస్థులు వాపోతున్నారు.
బ్రిడ్జి సమీపంలో ఇసుక తవ్వితే కఠిన చర్యలు
కనగల్ వాగు బ్రిడ్జికి అటు ఇటు ఐదు వందల మీటర్ల దూరంలోనే ఇసుక తవ్వకాలు జరపాలి. బ్రిడ్జికి సమీపంలో ఇసుక తవ్వితే వాహనాలను సీజ్ చేసి కేసు లు నమోదు చేస్తాం. అనుమతి ఉన్న చోటే ఇసుక తవ్వకాలు జరపాలి. కనగల్ వాగు రీచ్‌ను ఇకనుంచి తరుచూ పర్యవేక్షిస్తాం.
సామేల్ జాకబ్, నల్లగొండ జిల్లా మైనింగ్ ఏడీ