Share News

Damodar Rajanarsimha: ఈ ఏడాది చివరికి అందుబాటులోకి సనత్‌నగర్‌ టిమ్స్‌

ABN , Publish Date - Sep 20 , 2025 | 05:24 AM

నత్‌నగర్‌ టిమ్స్‌ ఆస్పత్రిని ఈ ఏడాది చివరి నాటికి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా అక్టోబరు నెలాఖరుకు నిర్మాణ పనులు పూర్తి చెయ్యాలని ఆర్‌ అండ్‌ బీ అధికారులను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ...

Damodar Rajanarsimha: ఈ ఏడాది చివరికి అందుబాటులోకి సనత్‌నగర్‌ టిమ్స్‌

  • అక్టోబరు నెలాఖరు కల్లా నిర్మాణ పనులు పూర్తవ్వాలి

  • అధికారులకు మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశం

హైదరాబాద్‌, సెప్టెంబరు19 (ఆంధ్రజ్యోతి): సనత్‌నగర్‌ టిమ్స్‌ ఆస్పత్రిని ఈ ఏడాది చివరి నాటికి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా అక్టోబరు నెలాఖరుకు నిర్మాణ పనులు పూర్తి చెయ్యాలని ఆర్‌ అండ్‌ బీ అధికారులను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ఆదేశించారు. ఈ మేరకు సనత్‌నగర్‌, ఎల్బీనగర్‌, కొత్తపేట టిమ్స్‌ ఆస్పత్రులు, నిమ్స్‌ ఆస్పత్రి విస్తరణ, వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌, వైద్య కళాశాల నిర్మాణ పనులపై ఆర్‌ అండ్‌ బీ, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సచివాలయంలో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. సనత్‌నగర్‌ ఆస్పత్రి నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయని, ఎల్బీనగర్‌ టిమ్స్‌ పనులు మరో 6 నెలల్లో పూర్తి అవుతాయని అధికారులు మంత్రికి వివరించారు. సనత్‌నగర్‌ టిమ్స్‌ను ఈ ఏడాది చివరిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించిన విషయాన్ని మంత్రి దామోదర ఈ సందర్భంగా అధికారులకు గుర్తు చేశారు. ఇరుశాఖల అధికారులు సమన్వయంతో పని చేసి నిర్దేశిత సమయానికి పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఆస్పత్రి ప్రారంభించిన రోజు నుంచే ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు వీలుగా అత్యాధునిక వైద్య పరికరాలు, ఇతర సామగ్రిని ముందుగానే సమకూర్చుకోవాలని వైద్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్‌ చొంగ్తుకు సూచించారు. వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది నియామకం చేపట్టాలని వైద్య విద్య సంచాలకులు డాక్టర్‌ నరేంద్ర కుమార్‌ను ఆదేశించారు.

Updated Date - Sep 20 , 2025 | 05:24 AM