Temple Renovation: మేడారానికి కొత్త సొబగులు
ABN , Publish Date - Dec 26 , 2025 | 05:27 AM
ములుగు జిల్లాలో వనదేవతల సన్నిధి మేడారం కొత్తకళ సంతరించుకుంటోంది. కోట్ల మంది భక్తుల ప్రకృతి దైవాలుగా కొలిచే సమ్మక్క-సారలమ్మ దేవస్థానం ఆధునికీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి...
రూ.251 కోట్లతో సమ్మక్క సారలమ్మ దేవస్థానం ఆధునీకరణ
ఆదివాసీ దేవతల చరిత్ర ఉట్టిపడేలా శిల్పకళ
31 రాతి శిలలతో ప్రాకార నిర్మాణాలు
గొట్టు గోత్రాలకు శాశ్వత రూపం
మహా జాతర నిర్వహణకు చురుగ్గా ఏర్పాట్లు
ములుగు, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ములుగు జిల్లాలో వనదేవతల సన్నిధి మేడారం కొత్తకళ సంతరించుకుంటోంది. కోట్ల మంది భక్తుల ప్రకృతి దైవాలుగా కొలిచే సమ్మక్క-సారలమ్మ దేవస్థానం ఆధునికీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. 80 ఏళ్ల క్రితం దేవతా వృక్షంతో సాధారణ మట్టి గద్దెలతో ఉన్న తల్లుల దేవస్థానం.. 1969లో రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయశాఖ ‘ఒడి’లోకి చేరింది. ఆ మరుసటి ఏడాది 1970లో తొలిసారి రాష్ట్ర పండుగగా ‘మహా జాతర’ నిర్వహించినప్పటి నుంచి మేడారం సమ్మక్క- సారలమ్మల దేవస్థానం, దాని పరిసరాలు కొత్త సొబగులు సంతరించుకుంటూనే ఉన్నాయి. గతంలో తాత్కాలికంగా క్యూలైన్లు, మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్, రోడ్లు ఏర్పాటు చేసి 4 రోజుల జాతర జరిపేవారు. కానీ, తాత్కాలిక ఏర్పాట్లతో రూ.కోట్లు వృథా అవుతున్నాయని భావించిన సర్కారు.. 2026 జనవరి 28-31 తేదీల మధ్య మహా జాతర నిర్వహణకు రూ.251 కోట్లతో మేడారం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించింది. వందల వసంతాల పాటు చరిత్రలో నిలిచిపోయేలా గిరిజనుల ఇష్ట దైవాల నిలయం మేడారం దేవస్థాన పరిధిలో శాశ్వత ప్రాతిపదికన కొత్త నిర్మాణాలు చేపట్టింది.
మారుతున్న మేడారం రూపురేఖలు
రామప్పను చూస్తే కాకతీయుల చరిత్ర స్ఫురణకు వచ్చినట్లే.. మేడారాన్ని చూస్తే గిరిజనుల దేవతల చరిత్ర జ్ఞప్తికి వచ్చేలా నిర్మాణాలు సాగుతున్నాయి. దేవస్థానం ఆధునికీకరణ, గోవిందరాజు, పగిడిద్ద రాజుల గద్దెల పునరుద్ధరణ, ఆదివాసీ దేవతల చరిత్ర ఉట్టి పడేలా శిల్పకళ, సాండ్ స్టోన్ పలకలపై 7,000 గిరిజన సంప్రదాయాల బొమ్మలు, 8 ఆర్చిగేట్లపై సమ్మక్క-సారలమ్మలతోపాటు పగిడిద్ద రాజు, గోవిందరాజు వంశాల చెట్లు, జంతువులు, గొట్టు గోత్రాల చిత్రాలు, వెదురుబొంగులను పోలిన 31 రాతిశిలలతో ప్రాకార నిర్మాణాలు సాగుతున్నాయి.
శిలలపై ఆదివాసీ గొట్టు గోత్రాలు
రాతి శిలలపై సమ్మక్క -సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల వంశం గొట్టు గోత్రాలు.. 6,3,4,5,7 గొట్టు చిత్రాలు రాతి శిలలపై చెక్కారు. వీటితోపాటు భావి తరాలకు తెలిసేలా ఆదివాసీలు, గిరిజనుల జీవన విధానం, రాజరికం, జంతువులు, వస్తువులు, వృక్షాలు, తదితర బొమ్మలను ఏర్పాటు చేశారు. ఆ రాతి శిలలపై సమ్మక్క-సారలమ్మలకు పూజారులు నిర్వహించే పూజలు, గొట్టు గోత్రాలు, వారి సంప్రదాయాల సంబంధిత బొమ్మలను చెక్కారు.
మేడారంలో గిరిజనుల పూజా వృక్షాలు
మేడారం వన దేవతల దర్శనానికొచ్చే భక్తులు అడవి ప్రాంతాలు, వసతి గృహాలు, విడిది స్థలాల్లో సమ్మక్క-సారలమ్మలను ప్రకృతి దైవాలుగా భావించి చెట్లకు పూజలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో విరివిగా 10 రకాల జాతుల మొక్కల పెంపకానికి ప్రణాళిక రూపొందించారు. ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్ల కిరువైపులా, మేడారం/ జంపన్న వాగు/ భక్తుల అతిథి గృహాల పరిసరాల్లో వేల సంఖ్యలో వందల రకాల ఔషధ మొక్కలు పెంచనున్నారు.